Saturday, October 8, 2016


"ఇంటింటికీ జిల్ల" పధకమను "దురద గుండాకు మరియు పండొర డబ్బ" (Pandora's Box) కధ

నిజానికి మన ముఖ్య మంత్రి గారిని "దొర, దొర" అని పటాయిత్తరు గాని, ఆయన ఓ చిన్న తోపుడు గాడి మీద "కొత్త రాష్ట్రం దొరా, కొత్త రాష్ట్రం దొరసానీ, కొత్త రాష్ట్రం పోరడా, కొత్త రాష్ట్రం బిడ్డా" అనిగడప, గడపకూ తిరిగి ఏదో చోటా, మోటా యాపారం చేసుకుంటుండే వాడు. గందుకే గప్పట్ల ఒక తూరి , "నేను ఎక్కని గడప లేదు, మొక్కని కాలు లేదు"  అని  చెప్పిండు.

యాదు మరిసిండ్రా ఏంది? గట్లనే ఓ తూరి గాంది బవను కాడి కెల్లి, "కొత్త రాస్ట్రం జానా, కొత్త రాష్ట్రం అన్నా" అని జబర్దస్తు అరిచిండు. జానా బయటి కొచ్చి, "నువ్వేంది బయ్యా! మాకు కొత్త రాష్ట్రం అమ్మేటిది? ఇచ్చేటిది మేమే, తెచ్చేటిది మేమే.  సంజయ్యిందా?" అని ఏదో చెప్పాలనుకుని, ఏదో చెప్తూ ఆదా గంట ఊక దంపుడు కొట్టిండు.    "నాకు సమజయ్యింది జానా అన్నా.  ఇంకా నీకే సమజ్ కాలే. ఇచ్చేటిది అమ్మే, తెచ్చేటిది అమ్మే. అమ్మ దేవత. గీ సంగతి నీకు తెల్వదు గాని, నాకు తెలస్తది." అని మన ముఖ్యమంత్రి (గప్పుడు కాదు, గిప్పుడు") ముక్తాయింపు ఇచ్చిండు. అప్పటి దాకా ఏం చెప్పాలనుకున్నాడో,  ఏం చెప్పాడో తనకే ఎరక బట్టని జానా, "గది నిజమే కానీ, గిప్పుడు నువ్వు అమ్మే కొత్త రాష్ట్రం నినాదం మేము కొంటే మాకేమిస్తావు?" తన దమాకుకు తానే ఖుషి అయ్యాడు జానా.      

"ఇచ్చుడంటే గట్లా, గిట్లా కాదన్న. ఈ యాపారమూ, ఈ గాడీ (గదే నండీ పార్ర్టీ) మీ క్కిచ్చెత్త. ఇంక మీరే ఏలుకొండ్రి. గెట్లయిన మీరు బడా, బడా దందలు సేసెటోల్లు.  మీ దందలోనే మాకు కూడా గింత  టుకడా వాట ఇయ్యుండ్రి. మీ పేరు చెప్పుకుని గింత గంజి నీళ్ళు తాగుతాం. గా ఆంద్రోల్ల గులాములుగ ఎన్నాళ్ళుంటాం చెప్పు" అని మన ముఖ్య మంత్రి గారు (గప్పుడు కాదు, గిప్పుడు) గాంది బవను అంతా ఇనేట్టు చెప్పిండు. అమ్మ దగ్గర ముద్ద, ముద్దగా (ముద్దు, ముద్దుగా) మాట్లాడ గల ఒకే ఒక్కడు వీ ఎచ్ బయటికొచ్చి ముద్దగా, "గట్లానె చేద్దంలే బై, ఫికర్ చెయ్యకు" అని ముఖ్యమంత్రి పదవి గురించి కలలు కని, కలవరించడం షురు చేసిండు.  

ఆల్లు ఇచ్చిండ్రో, ఈల్లు తెచ్చిండ్రో ఎరిక లేదు గాని నినాదం పోయి నిజంగానే రాష్ట్రం అచ్చింది. మన ముఖ్య మంత్రి గారు (గిప్పుడే, గప్పుడు కాదు) .గాడీ ఇయ్యలేదు కానీ గాంది బవన్లో ఆవులిస్తున్న జనాల్నందరిని (జానాను వదిలి) తన గాడీ మీద ఎక్కించుకుండు. దంద పెరిగింది. 

దంద పెరిగిన సంగతి ఒక్క తూరి అన్న ముఖ్య మంత్రి గారికి తెలిసింది. "అరె! భై! గింత పెద్ద యాపారం పది జిల్లలనుంచి గెట్ల చేత్తం. జిల్లలు పెంచుండ్రి" అని ఒక్క అరుపు అరిచిండు. అరిచిండులే! గంతే, ఆగ మేగాల మీద రిపోర్టులు తయారయ్యాయి. సరే! ఇంకో పదేడు జిల్లాలు తెరుదాం  అన్నారు, అమాత్యులు. తలలూపేరు అధికారులు. వహవా! అన్నరు గులాములు, మాకు కూడా ఏదో చిన్న పదవి దొరక్క పోతుందా అని. గంతే! మాయా బజారు సినేమా సూల్లే? గందులో గటోత్కచుడి మాయతో చెప్పులు, చేతి రుమాలులు కోసం కౌరవులు కొట్టుకుంటారు లే "నాకు, నాకు" అని గట్లా "నాకూ జిల్ల, నాకూ ఓ జిల్లా" (జిల కాదు, జిల అయితే సపట్ మలామో, జాలిం లోషనో  రాసుకో అని చెప్పుండొచ్చు. ఇది జిల్ల కదా)  అని ఒహటే రొద షురూ సేసిండ్రు జనం.

ముఖ్య మంత్రి గారికి తల తిరిగింది. "గిదేంది భై! గీ రొద. కాన్లల కాకులెక్కా కా, కా అని. పొద్దుగాల్నించి, పొద్దెకిన  దాక?"  అని ఇసుక్కుండు.

"గదే నన్నా! పండోరా డబ్బ ఖుల్లయ్యింది" అన్నాడో, బాగా సదువుకున్నానని దిమాకుల బిఠాయించుకున్నోడొకడు.   


"నీకు, దిమాకు గిన కరాబయ్యిందిరా !  పండోర డబ్బా గేందిరా?" 

"గదేనన్న! ఇంగ్లీసుల  "  Pandora's Box    " అంటారు చూడు! 

"ఓ! గదా? సిన్నప్పుడెప్పుడో సదువుకున్నాలే. నీకు మంచిగ దిమాకుందిరా భై.  మంచిగ యాదు కుంది. గిప్పుడీ పరేషాన్ నుంచి బయట పడాలె. నువ్వే సోచాయించి ఒక సలహా చెప్పు"

"థాంక్సన్నా! మనం ఇంటింటికీ సర్వే చేయించినాం. యాదుకుందన్న?

"యాదెట్ట మరుత్తానే. మొన్ననేగా కాయితాలన్నీ చిత్తు కింద అమ్మేసినాం. ఔ! గయితే యెందంటా? మల్లీ సర్వే చేద్దామా?"

"కాదన్నా? ఇంటింటికీ జిల్లా పధకమని పెట్టు.  గడప, గడపకీ జిల్లా! యెట్లుందన్నా?'

"నేను చెప్పినారాగా భై! నీకు దిమాకు, గదేందీ, పాదరసం లెక్క పరిగెడుతుంది."

"గంతే! మారాష్ట్రంల ఇల్లిల్లు జిల్లానే" అని మర్నాడే ఊదర కొట్టిండు, అన్న!  

పాలనా సౌలభ్యం.. మీ జిల్లకి మీరే కలెక్టరు, బిల్లు కలెక్టరు.ఇంకెవరు బందులు చెయ్యకుండ్రి.  ఖుషీనా! 

                            
                                       ################################### 

అన్న ఏదన్నా పని చేత్తే మల్లె సర్వే చేపిత్తాడు. ఈ సారి తనే సర్వేచేద్దమని బయలుదేరిండు. ఓ పేదోని గుడిసె కాడి కెల్లి, తలుపు కొడదామని చూత్తే తలుపు లేదు. పిలిచిండు . "ఓళ్లన్నా! లోపట?"  

"ఓ పెద్ద మడిసి బయటికొచ్చి "నమత్తే దొరా? లోపటకి రా" అన్నాడు.  

"కూర్చునొకి కుర్చీ అయినాఉందా? ఎట్ట బతుకుతారు భై. తలుపు కూడా లేదు! లోపట బంగారం , వెండీ , కంప్యూటర్లూ  లాటివి ఓళ్లన్న దోచుకుంటే  మల్లీ నన్నూ, నా పోలీసుల్ని తిట్టద్దు." 

"గదేంది  దొరా! మా కాడ అయ్యన్నీ ఎందుకుంటాయ్. ఏ రోజొచ్చింది ఆ రోజే "ఇంటిటికీ కల్లు వెలుగు" కార్యక్రమానికి దానం చేత్తం కదా దొరా. బాంచన్! "

"సర్లే! ఇంతకీ "ఇంటింటికీ జిల్ల" కార్యక్రమం ఏలా ఉంది?"

"బాగానే ఉంది దొరా!" అంటూ బరుక్కోటం మొదలెట్టాడు. 

అన్న కర్ధమయ్యింది. అతను జిల్లని వేరే విధంగా అనుకుంటున్నాడని.     

"గది కాదే! జిల్ల, జిల్ల" 

"ఏందొ దొరా! గా ఆంద్రోల్లు మూసి నది కరాబు, కరాబు సేసి పోయిండ్రు. బాంచన్! నువ్వైనా కాత్త సుబ్రం సేసి ఈ దురదలు తగ్గించు దొరా"   

"నా జనాలు ఖతర్నాకున్నారులే! నా పాఠాలు నాకే చెప్తుండ్రు" అనుకుని. "అది కాదే! నేను "ఇంటింటికీ జిల్ల" పథకం పెట్టిన కద! గా ముచ్చట! మీ ఇంటికి నువ్వే కలెక్టరువి కదా? గదెట్టుందని" అన్న కనుమాన మొచ్చింది.   కలెక్టరంటే తెలుత్తదా అని.  పెద్ద మడిసి సెప్పిన జవాబుకి అన్నకు దమాకు తిరిగింది.

"కల్లు ఎట్టటమేంది దొరా? (కల్లెట్టరు).  ఇయాల ఇంతగ మాట్టడుతున్నావు. కల్లు పొత్తరు గాని."  

                                                       ################### 

                                    
మీకు కుడా దిమాకు తిరిగితే మీరూ ఏదో రోజు ముఖ్యమంత్రవుతారు "ఇంటింటికీ రాష్ట్రం" పధకం కింద. 


                                                        ####################


ఇది నవ్వు కొనడానికే, నవ్వు అమ్మడానికి కాదు.