Wednesday, April 15, 2015

సూరమ్మ కధ

తెలుగులో కధ రాయడం నాకు ప్రధమం. ఆంగ్లంలో చేసిన ప్రయత్నాలు కొంతవరకు సఫలమైనాయి. ఎన్ని తప్పులు దొర్లాయో తెలియదు. కేవలం సరదాకి రాసేవే కాబట్టి ముఖ పుస్తకంలో పెడుతున్నాను. చదివిన వారు నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పండి.
నాకు 10-12 ఏళ్ళ వయస్సులో జరిగిన ఘటన. ఒక ముసలమ్మ ఇంట్లో వంట పదార్ధాలు దొంగిలించి దొరికి పోయింది. అందరూ తలకొక మాట అన్నారు. బలవంతంగా బస్సు లోంచి దించారు. తరువాత మా నాన్న గారు మా అమ్మతో అంటం విన్నాను. ' పిచ్చి ముసల్ది. దానికి మతి, మతిలో ఉండదు. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే అది మాత్రం ఏ చేస్తుంది. దానికి సహాయం చేసి ఆదుకునే బదులు దించేశారు ' అని బాధ పడ్డారు. పోనీ మీరైనా ఎమైనా సహాయం చేసుండాల్సింది. అని మా అమ్మ కళ్ళ వెంట నీరు పెట్టుకుంది. ' వంద రుపాయలు పంపాను ' అన్నారాయన. వీళ్ళిద్దరూ నాకు ఆదర్శం. చేతికి ఎముక లేకుండా దానం చేశారు. నాన్నగారు అందరూ ఉండీ దిక్కు లేకుండా పొయ్యారు. అమ్మ కూడా అందరూ ఉండి ఎవరూ లేకుండానే బూడిదై పోయింది. ఇది మొదటి సంఘటన.
నా 40 వ ఏట నన్ను కూడా 'దొంగ ' అని పేరు పెట్టి సాఫీగా సాగుతున్న నా జీవితమనే వాహనం నుంచి బయటికి తోశారు. అయిన వాళ్ళూ, కాని వాళ్ళూ దొంగ, దొంగ అన్నారు. నేను అన్ని లక్ష్ములూ పోయినా ధైర్య లక్ష్మిని నమ్ముకుని స్థిర పడ్డాను. వెనక్కి తిరి చూసుకోవడం మానెసాను. అది ఒక పీడ కలలా మిగిలిపోయింది. నా జీవితంలో దొంగ అని ముద్ర వేసిన వ్యక్తి నల్లకుంట, హైదరబదులో ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య, బిడ్డలతో సహా మరణించాడు. బాధ పడ్డాను. అంతకు ముందే వాళ్ళ అన్న జీవిత భీమా సంస్థలో పెద్ద అఫీసరుగా ఉండగానే పెద్ద జబ్బుతో చనిపోయాడు. నేను మోసిన నిర్జీవ శరీరాలలో అది ఒకటి.
అసూయ, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు దగ్గరికి రానీయకుండా నా కష్ట కాలంలో సహాయం చేయకపోగా ఎగతాళి చేసిన వాళ్ళందరికి దూరంగా బతుకుతున్నాను. ఇది రెండో సంఘటన. ఈ రెండు సంఘటనల సారాంశమే ఈ కధ.
ఈ కధలో ఊర్లు, మనుషులు, చెరువు వగైరా అన్నీ సజీవమైన పాత్రలే. ఐతే వారి, వారి గుణ, గణాలు, కధ మొత్తం కల్పితమే. ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు.
********************************************************************************************

                                                                               సూరమ్మ కధ
పండు వెన్నెల రోజులు. వేసవి తాపం తీరి అప్పుడప్పుద్డే భూమి చల్లబడుతుంది. వానలెప్పుడొస్తాయా అని రైతులందరు ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న, చిన్న వానలు తప్పితే పెద్ద వాన జాడ లేదు.. ఆకాశంలో చందమామ నవ్వుతూ దారే పొయ్యే వాళ్ళని పలకరిస్తున్నాడు. ఇంతలో ఆ దారిన పోతున్న ఓ నల్లని మేఘాని కేదో చుప్పనాతితనమొచ్చినట్టు చందమామని కప్పేసింది. వెనకాలే ఇంకోటి, దాని వెనకాలే ఇంకోటి ఇలా చండ్రుడితో దోబూచులాడుకుంటున్నాయి మేఘాలు. ఇంతలో చెరువు దిక్కు నుండి చల్లని గాలి. ఆ గాలి ఉండీ, ఉండీ పెద్ద దుమారంగా మారింది. దుమ్మూ, ధూళీ, ఆకులూ, అలములూ కొట్టుకొస్తున్నయ్. వాన వచ్చేట్టుంది అనుకున్నారు ఉళ్ళో వాళ్ళు. ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళు వేగం పెంచారు. రచ్చ బండలపై రాజకీయాలు మాట్లాడుకుండే వాళ్ళు పంచెలూ, కండువాలు సర్దుకుని లేచారు ఇక చాలు రేపు మాట్లాడుకుందామన్నట్టుగా.
కరణం కోటయ్య గారి ఇంటి ముందు ఆగి ఉన్న వ్యాను డ్రైవర్ వెంకటేషు గట్టిగా కూకేశాడు. 'కరణం పంతులు గోరూ! ఆన ఒచ్చేట్టుంది. తొరగా రావాల. వాగు దాటిందాకా కూసంత ఆలోసించాల్సిన ఇసయం. ఆడోల్ళ్ళని తొరగా రమ్మనండయ్యా.'
అవునర్రా! వాన ముంచుకొచ్చేట్టే ఉంది. తొరగా పెట్టెలూ, పెళ్ళి సరంజామా అదీ వ్యానులో కెక్కించండి.వాడు పైన సర్ది తాపాలేను అదీ కడతాడు.
“అన్నయ్యా! అన్నయ్యా! వీడెక్కడ ఉన్నాడో!" ఆయాసపడుతూ సూరమ్మ గట్టిగా అరిచింది.
"సర్లేవమ్మా! ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడని నీ వెధవ ముండా సొద ఆపు.నీ పెట్టె సర్దుకున్నావా? వేరే వాళ్ళ సామాన్లు పెట్టుకోలేదు కదా!
అప్పుడే భార్యా,పిల్లలూ, పెట్టే,బేడాతో లోపలికొస్తున్న పార్ధసారధి వ్యంగ్యంగా అన్నాడు.
"పేళ్ళికెళ్తూ శుభమా అని ఈ ముండమోపి మాటలెందుకండీ" బిక్కు,బిక్కు మంటూనే అంది పార్ధసారధి ఇల్లాలు సీతమ్మ.
"నువ్వు నోరు మూసుకో! మొగుడు చచ్చిన ముండని ముండా అనక ముత్తైదువుని చేసి పేరంటానికి పిలవమంటావా ఏమిటీ?"
"అదేం మాట అన్నయ్యా! సూరమ్మ బయటి మనిషెలా అవుతుంది? మావారి చెల్లెలే కదా?" కరణం గారి భార్య మెత్తగా మందలించింది.
“ఏం చెల్లెలెమ్మా! దిక్కులేని దాన్ని తీసుకొచ్చి వీళ్ళ నాన్న పెంచుకుని పెళ్ళి చేశాడు! ఆ అర్ధాయుస్షు ముండాకొడుకు పిల్ల, పీచూ లేకుండా మూడేళ్ళలో చచ్చాడు. ఆ ఆస్తిని పదింతలు చేసి కులుకుతుంది. ఇలా ఎన్నిళ్ళలో దోచుకుందో?" అక్కసంతా వెళ్ళగక్కాడు పార్ధయ్య.
"అవున్రా పార్ధుడూ! నువ్వు పొయ్యాక నీ భార్యకి అల్లాంటి వైభోగం జరిగేట్టు వీలునామా రాసి పోదుగాని." కరణం గారు సౌమ్యంగా మందలించాడు.
అప్పటిదాక మౌనంగావింటున్న సూరమ్మ, మిగిలిన ఆడంగులూ వడి, వడిగా లోపలికెళ్ళారు.
"అది కాదు బావా! " అని ఏదో చెప్పబోయాడు పార్ధసారధి.
ఒక్క వాక్యంలోనే సంభాషణ ముగించే కరణం గారు వడి,వడిగా అడుగులు వేసుకుంటూ డ్రైవర్ దగ్గరికి వెళ్ళారు, సామాను పని పర్యవేక్షించడానికి.
కరణం గారి రాకతో పనులు వేగం పుంజుకున్నాయి.
***********************
1965 సంవత్సరమనుకుంటా. కరణం గారి చివరి అబ్బాయి రాంబాబు పెళ్ళి. రాంబాబు మంచి బాలుడు అని పేరు. డిగ్రీ చదివి హైదరాబాదులో ప్రభుత్వోద్యోగంలో స్థిరపడ్డాడు. కరణం గారి ఇంట్లో చివరి పెళ్ళి అవటంచేతగానీ, రాంబాబు మీద ఉన్న ప్రేమతో కానీ వారం రోజుల ముందునుంచే చుట్టాల రాకడ ప్రారంభమయ్యింది. పెళ్ళి ఇంకా నాలుగు రోజులనగా మొత్తం యాభై మంది దాకా చేరారు. నాలుగు గుర్రబగ్గీలలో వెళదామనుకున్న కరణం గారికి వ్యాను మాట్లాడక తప్పింది కాదు. అప్పటికి దగ్గర పట్టణం బాపట్లలో రెండే వ్యానులు ఈ వూళ్ళకు వచ్చేవి ఉండేవి. అందులో ఒకటి నాయుడు గారిది. ఐతే నాయుడుగారి బంధువుల పెళ్ళి మరో రెండు రోజుల్లో ఉండటంతో ఆయన తటపటాయించారు. డ్రైవర్ వెంకతేషుకి కరణం గారంటే దేవుడితో సమానం. ఎన్నొ సార్లు కష్టాల్లో ఆయనే ఆదుకున్నారు. పిల్లోడికి జబ్బు చేస్తే ఎంతో డబ్బు కట్టి గుంటూరు పెద్దాసుపత్రిలో వైద్యం చేయించాడు. ఇప్పటి వరకూ ఆయన ఆ డబ్బు అడగలేదు. తను ఇవ్వ లేకపోయాడు. వెంకటేషే ధైర్యం చేసి నాయుడుగారికి ధైర్యం చెప్పాడు, ఎలాగైనా తిరిగి నాయుడుగారి బంధువుల పెళ్ళికి తిరిగొస్తానని.
"నువ్వంతటోడివేరా! ఐనా కరణం గారికి కాదని నేనెలా అంటాను. ఆలాటి దెవుడు బాబు ఎన్నో యుగాలకి కాని ఫుట్టడు." నాయుడుగారు వెళ్ళమని డ్రైవరుని పురమాయించాడు.
***************************
అవి జంట పల్లెలు. చెరువు,జమ్ములపాలెం. తాలూకా బాపట్ల పట్టణానికి 6 మైళ్ళు దూరంలో ఉంటాయి. బాపట్ల నుంచి ఈ ఊళ్ళకి వెళ్ళాలంటే ఒక వాగు దాటాలి. ఆ వాగుపై ఎప్పుడో బ్రిటిషు వాళ్ళు కట్టిన వంతెన ఉంది. ఈ ఊళ్ళకు తుఫానుల తాకిడి ఎక్కవ. ఎప్పుడు తుఫాను వచ్చినా వాగులో ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. వంతెన మీద కూడా నీళ్ళు వస్తాయి. అంతే ఈ ఊళ్ళకి రాకపోకలు ఆగి పోతాయి. అందునా ఈ మధ్యనే ఇంజినీర్లు వచ్చి వంతెన బలహీనంగా ఉంది. వాహనాలు మెల్లగా వెళ్ళాలని హెచ్చరించి, బోర్డు పెట్టి వెళ్ళారు. అడ్డదారి ఉన్నా నడవడానికే పనికి వస్తుంది. రెండు చక్రాల వాహనాలు కూడా అతి కష్టం మీద వెళ్ళాల్సిందే. పేరుకి రెండు ఊళ్ళయినా కొత్త్తగా వచ్చి చూసినవారికి అవి ఒక ఊరి లాగానే కనపట్టేవి, ఇప్పటి మన జంట నగరాలు లాగా. సరిగ్గా జంటనగరాల మధ్యలో హుస్సేన్ సాగర్ ఉన్నట్లే ఈ రెండు పల్లెలనూ కలుపుతూ ఒక మంచినీటి చెరువు వుండేది. ఈ చెరువు పేరుకు తగ్గట్టే చెరువు గ్రామ పరిధిలో ఉండేది. రెండు పంచాయతీలు కావడంతో కాగితాలపై సరిహద్దులు ఉండేవి రెవెన్యూ రికార్డ్లల్లో. కాని ఎన్నో దశాబ్దాలనుంచి కలిసి ఉంటున్న ఈ గ్రామాల ప్రజలకి సరిహద్దులు తెలియవు. ఉన్న చెరువుని రెండు గ్రామాల ప్రజలూ కలిసి మెలిసి వాడుకుండేవాళ్ళు. కులాల పట్టింపు ఉండేది కాదు.
చెరువు గ్రామానికి కొటేశ్వర శర్మ, ఉరఫు, కోటయ్య గారు కరణం కాగా వారికి స్వయానా మేనమామ కొడుకు, బావమరిది పార్ధసారధి జమ్ములపాలెం కరణం. ఇది వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయం. వూరు చిన్నదైనా చెరువు కరణం గారినే పెద్ద కరణం అనటం రివాజు.ముఖ్యంగా కొటయ్య గారు కరణీకం చేపట్టాక రెండు వూర్ల ప్రజలూ, బాపట్లలో ఉండే పోలిసు ఆఫీసర్లు, మేజిస్ట్రేటులూ ఆయన సలహాకే ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఇది పార్ధసారధికి కంటగింపుగా ఉన్నా చేసేదేమీ లేక కారాలూ, మిరియాలూ నూరుతుండేవాడు వినేవాళ్ళ దగ్గర.
***********************
కొటయ్య గారి తల్లిదండ్రులకు ఐదుగురు మగపిల్లలు. ఆయన భార్య ఐదు నెలల గర్భవతి. ఇంట్లో ఒక ఆడపిల్ల పట్టు లంగా కట్టుకుని, గజ్జెలు కట్టుకుని తిరగాలని భార్యా భర్తల ఆశ. ఊళ్ళో ఎక్కడ పేరంటం జరిగినా మా ఇంట్లో ఆడపిల్ల ఉంటే వైభవంగా పూజలు, పేరంటాలు చేసేదాన్ని కదా అని కంటనీరు పెట్టుకునేది కరణం గారి భార్య.
కొటయ్య గారికి లెక్కల్లో ఉన్న ప్రఙా పాటవాలు చూసి చిన్నతనంలోనే "కరణీకానికి"నా వారసుడు వీడే అని వారి తండ్రి నిర్ణయించారు. మిగిలిన నలుగురిని మంచి చదువులు చదివించిన వారి తండ్రి,కొటయ్య గారిని మాత్రం 18వ ఏటనే చదువు మానిపించి కరణీకంలో మెలకువలు నేర్పారు. మిగిలిన నలుగురూ చదువుకుని మంచి ఉద్యొగాలో వేరు, వేరు పట్టణాల్లో స్థిరపడ్డారు. కొటయ్య గారు తండ్రి తదనంతరం తన మెధా శక్తితో ఆస్తిని పదింతలు చేసి అన్నదమ్ముల భాగాలు వారి, వారికి పంచి ఇచ్చారు. పేరుకి చిన్న ఊరి కరణమైనా పెద్ద పంచాయతీ ప్రజలు కూడా సలహాలకి కొటయ్య గారి దగ్గరికే వచ్చేవారు. పార్ధసారధి కుటుంబనికి ఇది కొంచం కంటగింపైనా చేసేది లేక సమయం రాక పోతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు.
ఇంతలోనే ఒక విపత్తు సంభవించింది కుటుంబంలో. పక్క ఊర్లో ఉండే కరణం గారి చెల్లెలూ, ఆమె భర్తా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికి సూర్యకాంతం, చంద్రకాంతం అని ఇద్దరు పిల్లలు. సూరమ్మ,చంద్రమ్మ అని ముద్దుగా పిలుచుకునే వారు. బావగారి తరఫు అన్నదమ్ములూ, బంధువులూ పిల్లల విషయం మర్చిపోయి ఆస్తుల కోసం కొట్టుకోవడం చూసి తట్టుకోలేని కరణం గారు పిల్లలిద్దర్నీ తెచ్చుకుని పెంచుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజులకి వారికి ఇంకో ఆడపిల్ల పుట్టింది. ఆమే పార్ధుడి భార్య సీతమ్మ.
అసలు పార్ధసారధి సూరమ్మను పెండ్లాడాలని పెద్ద కరణం గారి కొరిక. ఆయన చనిపోతూ పిల్లలిద్దర్నీ కొటయ్య గారి చేతులో పెట్టి "వీళ్ళకు ఏ లోటూ లేకుండా చూడు. సూరమ్మకు పార్ధుడు తగిన వాడు. అంతా నీదే బాధ్యత" అని చెప్పి కన్ను మూశారు.
ఐతే పార్ధుడి తండ్రి అడ్డుపడ్డాడు. 'చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. నిన్న, మొన్నదాని చెల్లెలు చంద్రమ్మ క్షయ వ్యాధితో పోయింది. నా కొడుకునిస్తే వాడు మాత్రం మిగులుతాడని ఏమిటీ’ అని అభ్యంతరం చెప్పాడు.
కొటయ్య గారి దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు. అమ్మలక్కలు కూడా సూరమ్మ మీద జాలి చూపలేదు.
కొటయ్య గారి చిన్నకూతురుని పార్ధసారధికిచ్చి వివాహం జరిపినారు. అంతా ఎవరి సంసారాలు వాళ్ళు చక్కగా చేసుకుంటున్న తరుణంలో ఒక ఘోరం జరిగింది.
*********************
కొందరి మాటలు దీవనలైతే కొందరి మాటలు శాపాలుగా పరిణమిస్తాయి.కోటయ్య గారు పెద్దగా బాధ పడలేదు. పక్క ఊర్లో ఒక జమీందారీ కుటుంబం ఉండేది. నాలుగు తరాలు తిన్నా తరగని ఆస్తి. వారిది.ఒక్కడే కొడుకు. కాలు, చెయ్యి అవుడు. చిన్నప్పుడే పొలియో బారిన పడ్డాడు. వారంతట వారే సూరమ్మను చేసుకంటామని ముందుకొచ్చారు. కొటయ్య గారు ఇష్టపడలేదు. గాటి సూరమ్మ చక్కటి చుక్క. ముఖం చంద్రబింబలా ఉండేది. పొడుగాటి జుట్టుని పెద్ద జడ వేసుకొని, కనకాంబరం రంగు పట్టు లంగా, ఆకుపచ్చ రంగు వోణీ వేసుకొని ఊరంతా తనదే అన్నట్టుగా తిరిగే సూరమ్మను చూసి 'ఏ రాజకుమారుడు వచ్చి గుర్రం మీద తీసుకెల్తాద్డో అని మెచ్చుకుండేవాళ్ళు ఉళ్ళో వాళ్ళు. 'ఆ వస్తాడు కుంటి గుర్రం మీద.' అని ఎద్దేవా చేసే వాళ్ళు గిట్టని వాళ్ళు.
పెళ్ళి వైభవంగా చేశారు జమీందారు గారి ఖర్చుతోనే. సూరమ్మ పేరుతో ఉన్న ఐదెకరాల మాగాణి వరకట్నం కింద ఇచ్చారు కోటయ్య గారు. సూరమ్మ అత్తగారింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. సూరమ్మ చేతికి ఎముక లేదు అని ఆమె దగ్గర సహాయం పొందిన వాళ్ళు మెచ్చుకునే వారు. భర్తను, అత్త, మామలను కళ్ళలో పెట్టుకుని చూసుకుంది. పుణ్య క్షేత్రాలు తిప్పింది. "కొటయ్య గారూ, మీ పెంపకంలో సూరమ్మ సాన పట్టిన వజ్రమయ్యిందండీ" అని జమీందారు గారు మెచ్చుకునే వారు.
సూరమ్మ జీవితం మూడు, పువ్వులు ఆరుకాయలు అన్నట్టు సాగుతోంది. లంకంత ఇల్లు, నౌకర్లూ, చాకర్లూ, ఇంటికి వచ్చిపొయే అతిధులూ, వంటలూ, వార్పులూ క్షణం తీరిక ఉండేది కాదు సూరమ్మకి. ఐనా ప్రతి ఆదివారము భర్తను తీసుకుని అన్నయ్య గారింటికి వచ్చి వెళ్ళేది. అమ్మలక్కలు సూరమ్మను, ఆమె వైభవాన్ని కళ్ళారా చూసి దీవించి వెళ్ళేవాళ్ళు. అసూయ పడేవాళ్ళూ ఉండేవాళ్ళూ . ముదురు రంగు పట్టు చీరా, వొంటినిండా నగలతో మహాలక్ష్మిలా ఉండేది సూరమ్మ.
************************
ఐతే సూరమ్మ జీవితం వైకుంఠపాళి ఆట లాగానే సాగింది. ఒక మెట్టు నిచ్చెన ఎక్కితే రెండు పాములు కరిచేవి. వొడిదుడుకులన్నీ తట్టుకుని పెద్ద నిచ్చెన ఎక్కి ఇంకో నాలుగు గడులు దాటితే ఈ జీవిత వైకుంఠపాళీ ఆట గెలిచినట్లే అనుకుంటున్న తరుణంలో సూరమ్మ భర్త ఉన్నట్టుండి కుప్ప కూలి పోయాడు. గుండె పోటన్నారు డాక్టర్లు. ఆస్తి కోసం విషం పెట్టిందేమో, ముండ ఎంత పనైనా చెయ్యగలదన్నాడు పార్ధుడు. "అవునమ్మా! పెద్ద జమీందారీ కుటుంబాల్లో మాట బైటికి పొక్కనివ్వరు" అని గుస, గుసలాడారు అసూయ పడే అమ్మలక్కలు.
ఇవ్వేమీ సూరమ్మ పట్టించుకోలేదు . నాకు నా దేవుడు అన్యాయం చేశాడు అని గగ్గోలు పెట్టలేదు. పెద్ద, పెద్దగా ఏడవలేదు.గుడ్ల నీరు గుడ్ల కుక్కుకుంది. అత్తా, మామలని, అన్న, వదినలనీ, అయిన వాళ్ళని ఓదార్చింది. మహాలక్ష్మిలా ఉండే సూరమ్మ ముసలిదై పోయింది. నెత్తిన జుట్టూ, వొంటి మీద బంగారం, నుదుటిన పెద్ద బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతున్న సూరమ్మను చూసి అత్త, మామలు కుంగి పోయారు. సంవత్సరం తిరగకుండానే ఇద్దరూ కాలధర్మం చెందారు. పోక ముందే మామగారు ఆస్తి అంతా సూరమ్మ పేరు మీద రాసి కొటయ్య గారికి పొవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చి పొయ్యారు. "కొటయ్యా! నువ్వే దానికి తల్లీ, తండ్రీ, అత్తా, మామ అన్నీను. జాగ్రత్తగా చూసుకో." అని చెప్పి కన్ను మూశారు.
సూరమ్మ అత్త, మామల మరణానంతరం, భవనానికి తాళం వేసింది. ఇంటి వెనక ఉన్న పెంకుటింట్లోకి మారింది. నౌకర్లందరికీ తలకొక ఐదెకరాల పొలం, తలకి 25000 రొక్కం ఇచ్చి పని మానిపించింది . ఏ అవసరం కావాలన్నా సూరమ్మ బతికే ఉందని గుర్తుంచుకోండని అని ధైర్యం చెప్పింది. వాళ్ళు వదులుతేనా? రోజూ ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళు. సూరమ్మ వద్దన్నా అన్ని పనులూ చేసే వారు. ఎప్పుడైనా అన్నయ్య దగ్గరకి వెళ్ళాలంటే కనీసం ఇద్దరు తోడుగా వెళ్ళే వాళ్ళు. ఇంతలో రాంబాబు పెళ్ళి నిశ్చయమైంది. మొదటిసారి సూరమ్మ కళ్ళల్లో ఆనదం కనపడింది. రాంబాబంటే పంచ ప్రాణాలు సూరమ్మకి. రాంబాబు కాబోయే భార్యకు 20 శవర్ల బంగారంతో నగలు చేయించింది . ఎన్ని చీరలు కొన్నదో లెక్కే లేదు. పెళ్ళికి వారం రోజులకి ముందే కొటయ్య గారింటికి వెళ్ళి హడావిడి చేసింది. సూరమ్మ సంతోషాన్ని చూసి అందరూ దేవుడికి వేనోళ్ళ మొక్కారు.
*******************
"సినుకులు మొదలైనాయ్. నడుండి పంతులుగోరూ!"
.డ్రైవరు పెద్దగా కేకేశాడు. "తుపానుట" నాన్న రోడియోలో విన్నాడు" పార్ధుడి కొడుకు చల్లగా చెప్పాడు. తుపాను పేరు వినగానే ఎక్కడి వాళ్ళక్కడ సంచులు పట్టుకుని వ్యానులో ఎక్కారు. అప్పటికే పెళ్ళి సరంజామా అంతా పైన ఎక్కించి టార్పాలిన్ గట్టిగా కట్టారు వెంకటేషూ, గూని బ్రహ్మం. ఎందుకైనా మంచిదని మళ్ళీ తాళ్ళు పట్టుకుని లాగి చూశారు. "తూపాను కాదు కదా దాని బాబుగాడొచ్చినా కదలదు" తన పనితనాన్ని తనే మెచ్చుకున్నాడు వెంకటేషు. "అంతా ఎక్కారర్రా?" అరిచింది సూరమ్మ. "ఏదీ? నీ మరిది పార్ధుడు, సీతమ్మా కనపడందే? లోపలేం చేస్తున్నరో. పెడసరం కాలం, పెడసరం బుద్ధులూనూ!" సన్నాయి నొక్కులు నొక్కింది ఓ ముసలావిడ. సర్లే నీ మొగుడు అర్ధాయుష్కుడని అందర్నీ ముండమోపుల్లగా బతకమంటావా ఏమిటీ?" ఓ ముసలి ముత్తైదువు తిరిగి నొక్కింది. "ఉన్నాడు లేవమ్మా మొగుడు. ఎందుకూ. ఒక పిల్ల పీచా?" 12 మంది సంతానాన్ని కని పదమూడో సారి తయారైన మొదటి ముసలమ్మ కూతురు ఎదురు నొక్కింది. "అదేం లేదు" అన్నాడు పార్ధుడి కొడుకు ఆరిందా లాగా. అందరూ పెద్దగా నవ్వారు.
******************************
"ఉండడర్రా! నేనే చూసొస్తాను" అంటూ సూరమ్మ గారు బయలుదేరారు. ఈ లోగానే కస్సు బుస్సు మంటూ పార్ధసారధి, భయం, భయంగా సీతమ్మ వస్తున్నారు. "ఒకటా, రెండా 30 శవర్లు. ఎవరు పొట్టన పెట్టుకున్నారో. బావా! వ్యాను ఆపు. అందరి పెట్టెలూ చూశాకే కదిలేది" సారధి ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అంతుబట్టలేదు. కరణం గారు కల్పించుకుని " ఎమిట్రా! నగ గానీ ఎక్కడన్న పెట్టి మర్చిపొయ్యారా ఏమిటి?" అని అడిగారు. "మర్చిపోవడానికి అది ఎవరు? నీ చెల్లెలు. అది పొరపాటున కూడా మర్చిపోదు. ఎవరో తీసి దాచిపెట్టుకున్నారు. అందరి పెట్టెలూ వెదకాల్సిందే" పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు సారధి. "అయినా అంతా మన వాళ్ళే కదా. ఎవరు తీస్తారు. ఎక్కడో పెట్టి మర్చ్చిపోయుంటుందిలేరా సీతమ్మ. అందరూ ఎక్కండి త్వరగా. వాన పెరిగేట్టుంది. తుపాను కూడా అంటున్నారు." కరణం గారు సౌమ్యంగానే చెప్పారు. " వాన కాని, వరద కాని ఇప్పుడే చూడాల్సిందే" పట్టుబట్టాడు పార్ధుడు. తర్జన, భర్జనల తరువాత వెదకడానికే నిర్ణయించారు కరణం గారు. "ఆ పనేదో మీరే చెయ్యండి" అన్నారంతా. కరణం గారు, ఆయన భార్యా, సూరమ్మా అన్ని పెట్టెలూ వెదకడం ప్రారంభించారు. కాసేపటికే సూరమ్మ పెట్టెలో నగ దొరికింది. "నేను చెప్పానా? ఎంత టి వాళ్ళైనా ఉంటారని. ముందర సూరమ్మని దించండి. తిరిగొచ్చాక మాట్లాడదాం." కసిగా అన్నాడు పార్ధసారధి. "ఇంత వానలో ఎక్కడికి వెళ్తుందని కొందరు, వెళ్ళాల్సిందే అని కొందరూ వాదించుకున్నారు. చివరికి అందరూ కరణం గారి వంక చూశారు. దిగి పొమ్మని సూరమ్మకి సైగ చేశారు కరణం గారు సూరమ్మ మారు మాట్లాడకుండా దిగి పోయింది. "ఇంక బయలుదేరండి. వాన పెద్దదవుతుంది" కరణంగారు డ్రైవర్ని ఆదేశించారు. వ్యాను కదిలింది. వెంకటెష్ బండి తోలుతున్నాడే కానీ ఆలోచనలే ఆలోచనలు. సూరమ్మ గొరు అంత మంచి మడిసి కాదా ఈ పనెందుకు చేస్తుంది? చిన్న పంతులు గారే నాటకం ఆడారా?" ఇలా. ఇంతలో పెద్ద ఉరుము. 'పిడుగు పడ్డట్టుంది ఎక్కడో' గూని బ్రహ్మం వణుకుతూ రాగం తీశాడు. 'ఉండు నీయవ్వ! అబశకునం మాటలూ నువ్వున్నూ నోరు మూసుకూర్చో' గద్దించాడు వెంకటేషు. పెద్ద మెరుపు . మెరుపు వెలుగులో పార్ధసారధి ముఖంలో కొట్టొచ్చిన ఆనందం గమనించారు కొంతమంది ఆయన మీద అనుమ్మకమున్న వాళ్ళు. 'దొంగ వెధవ ' అనుకున్నారు. ఇంతలో వాన పెద్దదయ్యింది. వానకు తోడుగా పెద్ద గాలి తోడయ్యింది. వ్యానులోఅందరూ తడిసి ముద్దయ్యారు. సామాన్లన్ని చెల్లాచెదురైనాయి. "ముందు వాగు దాటించాలి. లేదంటే వంతెన కనపడదు." అని వేగం పెంచాడు. వాగు దగ్గరికి వెళ్ళేప్పటికి వాన జోరందుకుంది. "పంతులుగోర్లు, లోనకెళ్ళి కూర్చోండి. బండి ఒరుగుద్ది." గట్టిగా అరిచాడు వెంకతేషు. ఆ గాలి శబ్దంలో ఎవరూ వినలేదు. ముందర చక్రాలు వంతెనమీదకి వెళ్ళగానే బండి ఎడమవైపుకి ఒరిగింది. తలుపునానుకున్న సారధి బరువుకి తలుపు తెరుచుకుంది. సారధి, పిల్లలూ వాగులో పడిపొయారు. వెనక ఉన్న నలుగురు, ఐదుగురూ కూడా అదాట్టున భయంతో దుకేశారు. వెంకటేష్ ఒక్కసారిగా బ్రేకు మీద కాలు పెట్టి "ఒరే! గూనిగా, తలుపేసెయ్యి" అరిచాడు. గూనిగాడు తలుపేశాడు. ఒక్కసారిగా బండిని వెనక్కి మళ్ళించాడు వెంకటేషు.. వెనక తలుపు తెరుచుకుని ఇంకో నలుగురు బురదలో పడ్డారు. వ్యాను పూర్తిగా వంతెన నుంచి కిందకొచ్చాక వెంకటేషు ఒక్క క్షణం ఆలశ్యం చెయ్యకుండా వాగులో దూకి నలుగుర్ని ప్రాణాలతో బైటికి లాగాడు. పార్ధసారధి, పిల్లలూ, ఇంకో ముసలావిడ మాత్రం కొట్టుకు పొయ్యారు. అరుపులూ, పెడబొబ్బలూ. సీతమ్మ స్పృహ తప్పింది. తెల్లవారిందాకా ఉండి దెబ్బలు తగిలిన వాళ్ళకి సపర్యలు చేసి పెళ్ళి బృందం వెనక్కి వెళ్ళి పొయ్యారు, వ్యానుని, వెంకటేషుకి వదిలేసి.
సూరమ్మ జాడలేదు. అన్ని చోట్ల వెదికారు. అవమానం భరించలేక అత్మహత్య చేసుకుని ఉంటుంది అనుకున్నారు చాలామంది. కోటయ్య గారు మాత్రం సూరమ్మ వస్తుందనే ఆశతోనే ఉన్నారు. అవును మరి, సూరమ్మ ధైర్యం ఆయనకి తప్ప ఎవరికి తెలుస్తుంది?
సంవత్సరం గడిచింది. సీతమ్మ కొటయ్య గారి ఇంట్లోనే ఉంటోంది. వాళ్ళ వ్యవహారాలూ కొటయ్య గారే చూస్తున్నారు.
*****************************
ఒక రోజున గుర్రబ్బగ్గీలో సూరమ్మ దిగింది. ఎవరూ నమ్మలేకపోయారు. కొంతమంది భయపడ్డారు కూడా దయ్యమేమోనని.. అదే ధైర్యం ఆమె ముఖం లో. కరణం గారు తన నమ్మకాన్ని వమ్ము చెయ్యనందుకు ఆ కనపడని దెవుణ్ణి వేనోళ్ళ మనసులోనే శ్లాఘించారు.
సూరమ్మ రామేశ్వరంలో ఒక సత్రంలో ఉంటోంది. ఇప్పుడా సత్రానికి పక్కన వెరే సత్రం కట్టించి ఇవ్వాలనీ, అందులోనే సీతమ్మకూ తనకూ వసతి, భోజనాలు ఏర్పటు చేసుకోవాలని డబ్బు గురించి వచ్చింది.
'చెప్పకుండా వెళ్ళి పోయాను. తప్పు క్షమించు అన్నయ్యా. మామయ్య చెప్పినట్టు నేను దురదృష్ట జాతకురాలినేమొనని ఒక్కసారి మనస్సు చివుక్కు మంది. ఆ వానలోనే అడ్డ దారిలో బాపట్ల చేరుకున్నాను. వరద తగ్గాక ఉత్తరం రాదామనుకున్నాను. ఈలోగా దక్షిణంలో వరద, వానా లేవని ఎలాగైనా గుంటూరు చేరుకుంటే అక్కడనుంచి రామేశ్వరం వెళ్ళొచ్చొని, ఊళ్ళో ఒక యాత్రీకుల బృందం బలవంతం చేస్తే వాన జోరు తగ్గగానే నడుచుకుంటూ గుంటూరు చేరుకొని, అక్కడ నుండి ఒక యాత్రా బస్సులో రామేశ్వరం చేరుకున్నాం. మిగిలిన వాళ్ళు తిరిగొచ్చాక నా కబురు నీకు చెబుతానన్నారు. నేనింకా ఆ భ్రమ లోనే ఉన్నా. అక్కడ ఒక గురువు గారి ఆశ్రమంలో చోటు దొరికింది. వారు ఎంతో ధైర్యం చెప్పి ఈ సత్రంలో చోటు కల్పించారు. వచ్చీ పోయే యాత్రీకుల రద్దీ చూసి నేనే నాన్న పేరుతో ఒక సత్రం కట్టిస్తానని చెప్పి ఇటు వచ్చాను, మిమ్మల్నందర్నీ చూసినట్టూ ఉంటుందనీ'
సూరమ్మ ఊళ్ళో వారం రోజులుంది. ఈలోగా సీతమ్మను మానసికంగా తయారు చేసింది. వాళ్ళ ఆస్తిపాస్తుల వ్యవహారాలు కొటయ్య గారికి అప్పగించి, తనూ సీతమ్మ బయలుదేరారు. బయలుదేరే ముందు సూరమ్మ తన ఆస్తినంతా దానం చేసి తన జీవితానికి సరిపడా డబ్బు అన్నయ్య దగ్గర ఉంచి వెళ్ళింది.
‘అన్నయ్యా! నా ఆస్తిలో 10 ఎకరాల భూమి, రెండు పెద్ద బస్సులకి సరిపడా సొమ్ము వెంకటేషు కివ్వు. వాడే లేకపోతే నాకు ఎవరూ మిగిలే వాళ్ళు కాదు. మిగిలిన ఆస్తంతా అమ్మి బాపట్లలో ఒక ధర్మ సత్రమూ, ఒక పాఠశాలా కట్టించి. మా మామ గారి పేరు, అత్త గారి పేరు వాటికి పెట్టించు. ఏమన్న మిగిలితే దాన, ధర్మాలు చెయ్యి అని చెప్పి దస్తావేజులు చేయించి సీతమ్మను తీసుకుని రామేశ్వరం వెళ్ళిపోయింది సూరమ్మ
**************
ఈ కధ ముగిసిందా? సూరమ్మ దొంగతనం చేసిందా, నిజంగానే? ఆమెకేమవసరం? పార్ధసారధిపై కక్షతో చేసిందా? లేదా సూరమ్మపై కార్పణ్యంతో పార్ధసారధే ఈ పని చేసాడా? వ్యానులో ఉన్న మిగిలిన వాళ్ళంతా ధర్మాత్ములేనా? ఒక్క సూరమ్మే శిక్ష ఎందుకు అనుభవించింది?
ఈ ప్రశ్నలకు సమాధానం కొటయ్య గారికి, సూరమ్మకు, చచ్చి పోయిన సారధికి, ఆయన భార్య సీతమ్మకి మాత్రమే తెలుసు. చివరి ప్రశ్నకు సమాధానం ఒక్క దేవుడికే తెలుసు.