Monday, June 22, 2015

సాగర మధనమనే నా స్వీయ చరిత్రలో భాగం- తెలుగులో You have enemies? Good. That means you've stood up for something, sometime in your life. Winston Churchill


."జీవితమనేది పరిష్కరించ వలసిన సమస్య కాదు. అనుభవించాల్సిన నిజం."   ఈ నిజాన్ని నేను పూర్తిగా అనుభవించాను. అనుభవాలనుంచి గుణ పాఠాలు నేర్చుకున్నాను. నేర్పాను. అయ్యీ, కాని వాళ్ళని వదిలేశాను. ఏమీ కాని వాళ్ళకి సహాయం చేస్తున్నాను.


ఆ తరువాత ఒక్క సారే మా వూరు వెళ్ళాను. ఒక శని వారం రోజు బయలుదేరి వెళ్ళి మళ్ళీ సోమ వారం తిరిగి వచ్చాను. మా నాన్న గారిని ఉంచిన ప్రైవేటు ఆస్పత్రిలో వాళ్ళు "లాభం లేదు ఇంటికి తీసుకు వెళ్ళ మన్నారట". ఇంటికి తేవడానికి మా ఇంటి యజమాని ఒప్పుకోలేదు. రోగిని ఇంట్లో పెట్టుకుంటే అరిష్టమన్నాడట. ఎదిరించే ధైర్యం లేదు. డబ్బు ఖర్చు చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యలేదు. చెయ్యలేని మా తమ్ముడు నిస్సహాయంగా . ఉన్నాడు  ఇవన్నీ కనీసం నాకు వ్రాయ లేదు. మా ఇంటి యజమాని ప్రభుత్వ ఆస్పత్రికి ఆహారం పమిణీ చేసే కాంట్రాక్టరు. ఆయనే చెప్పి ఒక బెడ్డు ఇప్పించాడు. నర్సింగు లేదు. అంతా మా తమ్ముడే చేశాడుట. నేను వెళ్ళేటప్పటికి కోమాలో ఉన్నారు. 20 ఏళ్ళ వయసు. ఏడిచాను, గుండెలవిసేలా. జనవరి 24 న ఆయన ప్రాణం పోయింది. ఈ వార్తా మోసుకొచ్చింది మా మేనమామ గారే. "పద పోదాం" అని సెలవు ఒక్క రోజు తీసుకున్నాడు మా ఆఫీసరు దగ్గర. రాత్రి బయలుదేరి ప్రొద్దున్నే  వెళ్ళాము.

ఎంత దుస్థితి? మా నాన్నగారి పార్ధివ శరీరాన్నిరోడ్డు మీద మురుగు గుంట కింద పడుకో బెట్టారు. ప్రధాన ద్వారం గుండా లోపలికి తేవెడానికి వాస్తు అడ్డమొచ్చిందని మా యజమాని పేచీ పెట్టాడు. ఎంత క్రూరత్వం? నీచమైన ఆచారాలు? శవ దహన మయ్యింది. చలి రోజులు. మేము తండ్రి పోయి ఏడుస్తుంటే మా వదిన వాళ్ళ ఆయన చన్నీళ్ళ స్నానం చెయ్యాల్సొచ్చిందని ఏడవడం మొదలెట్టింది. ఏమి సంస్కారమండీ.? ఇవన్నీ  నా మనసును చాలా గాయ పరిచాయి. అసలే వ్యవస్థ మీద పొరాడాలనే కక్ష. తోడుగా ఇవన్నీ. ఇంకా నన్ను మూర్ఖుడిని చేశాయి. ఎదిరించడం ఎక్కువయ్యింది. చెప్ప దలుచుకుంది సూటిగా చెప్పడం మొదలెట్టాను. శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. నా కక్ష ద్విగుణీకృతమవుతూనే  ఉంది. భవిష్యత్తులో నా జీవన గమనానికి  ఆ రోజున పడ్డ బీజం. కోపం అనే అంతః శతృవు  కాటేసింది. 50 ఏళ్ల వయసు వరకూ అదే కోపం. ఎదురుగా ఎవరున్నా దులిపేయడమే.

"జీవితమనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు. నిన్ను నువ్వు పునః సృష్టించుకోవడం."

10 వ రోజున  ధర్మోదకాలు వదలడానికి బాపట్ల దగ్గర మా నాన్న గారి జన్మ స్థలానికి రావాలి అన్నారు. అన్నీ జీతం నష్టం సెలవులే. వెళ్ళాను. ఆ పల్లెటూరు చేరేటప్పటికి చాలా పొద్దు పోయింది. చీత్కారాలు. తండ్రి  మీద ప్రేమ ఉంటేగా? అని అన్న దమ్ముల హేళనలు. పురోహితుడు "బుద్ధుందిటయ్యా?" అని తిట్లు. ఒక రోజు ముందు సెలవు తీసుకోవచ్చు కదా, ఈసడిపంపులు. మళ్ళీ మంగలిని పిలవాలి, విసుగు. నాకు కోపం. సెలవు ఎవడిస్తాడు. రోజుకి 12 రూపాయలు పోతాయి. ఎవడు వింటాడు. బ్రాహ్మణ్యం మీద కోపం. ఆ కులంలో పుట్టినందుకు కోపం. ఈ ఆచారాలంటే కోపం. ఎదురు తిరగాలి. ఎంత అవకాశముంటే అంత మార్చాలి. నిర్ణయం అయ్యింది. అమలు పరిచాను. శతృవులు పెరిగారు, ఇంటా, బయటా. ఈ రోజూ అలాగే ఉన్నాను. నా వృత్తి కాక పోయినా మంత్రాలన్నీ విని నేర్చుకున్నాను. ఈ రోజు అభిషేకాలూ, పూజలూ  చేస్తాను. నా పద్ధతి లోనే. ఎవర్నీ బాధ పెట్టను. వాస్తుని నమ్మను. చాలా ఉన్నాయి,. తరువాత.

నాలుగు రోజులు మకాం. నాకు ఏమీ తెలియదు. సంతకాలు పెట్టమన్నారు. పెట్టాను. పొలం అమ్మేశారు. చవగ్గా. ఎవరు కర్చు పెట్టిన కర్మ కర్చులు వాళ్ళు తీసుకున్నారుట? మిగిలింది మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి డిపాజిట్టు చేశారుట. అప్పులు తీర్చారో లేదో గుర్తు లేదు. మా స్నేహితుడి వాళ్ళ ఇంట్లో చేసిన అప్పు మాత్రం తీర్చ లేదు. మా ప్రధానోపాధ్యాయుల  దగ్గర తీర్చలేదు. మా ఎం ఎల్ ఏ గారి కోడలుకి తీర్చలేదు. ఎందుకంటే ఇవన్నీ నేను 1976 లో తీర్చాను. ఆ కధ తరువాత.

నేను బయలుదేరే ముందు చివరి ఘట్టం. అమ్మని ఒక చోట కూర్చోబెట్టి బిందెలతో చల్ల నీళ్ళు  పోయడం, తెల్ల చీర ఇవ్వడం, గాజులు పగల కొట్టడం. చూడ లేక పోయాను. ఛీ! పాడు ఆచారాలు. ఆమెకు 46 ఏళ్ళు. జీవితంలో అన్ని రోజులూ గుర్తుకు ఉండవు. కొన్ని క్షణాలు మాత్రమే గుర్తుంటాయి. మా అమ్మ మళ్ళీ అందరి మాదిరిగానే బ్రతికింది. పూర్వపు పద్ధతులకు ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు.

ఇది అయ్యాక ఇక మిగిలింది, సంసారం మళ్ళీ ఎలా నిలదొక్కుకోవాలి. ఎక్కడుండాలి. మా తమ్ముడి డిగ్రీ చివరి సంవత్సరం  పరీక్షలూ, ఆడ పిల్లల స్కూళ్ళూ అయ్యాక ఏం చెయ్యాలి. పెద్దాయన హైదరాబాదులో, రెండు మద్రాసులో, మూడు ఇంకా ఉద్యోగం లేదు. నేను హైదరాబాదులో. కొత్త ఉద్యోగం. అన్నయ్య దగ్గరే ఉంటున్నాను. ఇంత పెద్ద సంసారం హైదరాబాదులో బ్రతకడం కష్టం. అందరం తలకొక 50 రూపాయలిచ్చి అక్కడే వుంచుదామని ఆయన, కాదని నేను కొన్నాళ్ళు తర్జన, భర్జనలు పడ్డాము. ఈ లోగా మా మూడో అన్నయ్యకి సిండికేటు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. మా తమ్ముడి డిగ్రీ పూర్తయ్యింది. ఆయనకి నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో పోస్టింగు. అది ఒక పెద్ద పల్లెటూరు లాంటి పట్టణం. ఒక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ అందరూ ఉండాలని నిర్ణయం అయ్యింది. వెళ్ళారు. వెళ్ళిన నాలుగు నెలలకి ఉత్తరాల మీద ఉత్తరాలు. "ఈ వూరులో ఉండటం కష్టం. ఆడ పిల్లలకి ఏమన్న జరిగితే నా బాధ్యత లేదు. నువ్వే ఏమన్నా చేసి వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి" అని మా పిరికి భీముడు వ్రాయడం, వెంట, వెంటనే మా అమ్మ వీడు మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు, వెంటనే వచ్చి తీసుకెళ్ళు అని మా అమ్మా, తమ్ముడూ వెనకాలే సందేశాలు. అప్పటికే మా పెద్ద చెల్లెలు అక్కడ జూనియర్  కాలేజీలో చేరింది. ఇక్కడ అడ్మిషన్లు అయి పొయ్యాయి. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. పెద్దాయన ససేమిరా అలా కుదరదు. నేను ఒక్క రూపాయి సహాయం చెయ్యను అని బల్ల గుద్ది చెప్పాడు.  జీవితంలో వెరే వాళ్ళకి సహాయ పడడం ముఖ్యం. అలా చెయ్యలేకపోతే కనీసం వారిని బాధించకుండా ఉండగలగాలి.

ఈ లోగా, నేను వేరే ఇల్లు వెదకడం మొదలు పెట్టాను. అదే ప్రాంతంలో. ఇక్కడ ఉండొద్దు. నా పరువు పోతుంది, అని ఆయన. నీకు ఉంటే కదా పోవడానికి అని నేనూ రోజూ యుద్ధం. చెప్పాను కదా. ఎంతటి వాడితో అయినా అలానే మాట్లాడే వాడిని. ఈ లోగా ఒక ఒక గొప్ప వింత జరిగింది. మా అన్నయ్య ఇంటి పక్క పోర్షను ఖాళీ అయ్యింది. అద్దె 170 రూపాయలు. ధైర్యం చేసి మా ఇంటి ఓనరుని అడిగాను. ఆయన సలహా చెప్పాడు, ఒకే ఇంట్లో పక్క, పక్కన ఉండటం మంచిది కాదేమో ఆలోచించుకో అని. మీ అన్నయ్య బాధ పడతాడేమో  అని కొంచెం తటపటాయించాడు. ఇంట్లో ఏమనుకున్నరో ఏమో మర్నాడు పిలిచి సరే అన్నాడు. మరి అంత అద్దె కడతావా అని అడిగాడు. కడతాను, మా తమ్ముడికి టెలిఫోను డిపార్ట్ మెంటులో  135 రూపాయల స్టైపెండుతో జూనియర్ ఇంజినీరుగా వచ్చింది. నా జీతం పెరిగి 430 రూపాయలయ్యింది. (మేము చేరంగానే జీతాల సవరణ జరిగింది, డీ ఏ పెరిగింది) మా అన్నయ్య 50 రూపాయలు పపుతాడు. పెద్దాయన ఇచ్చినా తీసుకోను అని చెప్పాను. సరే ఇల్లు తీసుకుని అడ్వాన్సు ఇచ్చాను. అప్పుడు మా అన్నయ్యకి చెప్పాను. ఇక ఒక కిటికీ దగ్గర నిలబడి, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చేసినట్లు ధర్మోపదేశం చెశాడు. నువ్వు ఎంత చేసినా వాళ్ళు నిన్ను పొగిడి నెత్తికెక్కించుకుంటారనుకోబోకు. నీ డబ్బంతా ఇప్పుడే వాళ్ళ మీద పెడితే రేపు నీ భార్యా, పిల్లల విషయ మేమిటి. నీకేమన్నా కష్టమొస్తే, "ఒక్కండును, ఒక్కండును, ఒక్కండును నీ దరికి రాడు" ఇంకా చాలా చెప్పాడు. నిర్ణయం అయిపోయింది . అమ్మా వాళ్ళు వస్తున్నారు, ఖండితంగా అని చెప్పాను. జీవితంలో మనం సమాధానం చెప్ప వలసిన మొదటి, అత్యవసరమైన ప్రశ్న మనం వేరే వాళ్ళకి ఏం చేస్తున్నామనేది. మా ఇంటి ఓనరుతో మాట్లాడాడు . మీ ఇంటి విషయాలు అనవసరం కూడా అని "తాబులాలిచ్చేశాను. తన్నుకు చావండి" అన్నట్లు మొహం మీద కొట్టినట్లు చెప్పాట్ట. వచ్చేశాడు.  నాకు తెలియదు. నేను ఇల్లు తీసుకుని, అడ్వాన్సు ఇచ్చి  మా అమ్మ వాళ్ళని తీసుకు రావడానికి టిక్కట్లు   రిజెర్వు చేయించాను.అందర్నీ తీసుకుని, 12 పెట్టెలతో ఆత్మకూరు నుంచి నెల్లూరు, అక్కడ నుంచి హైదరాబాదు. సామాను ట్రక్కులో వచ్చింది.

20 ఏళ్ళ వయసుల అది సాహసమే. అందరూ నాకు ఎదురే. ఒంటరిగానే పోరాడాను. ఇంటికి వచ్చాము. మా పోర్షను  ముందు ఒక పెద్ద వరండా  ఉండేది. ఒక పెద్ద హాలు, ఒక కిచెనూ. హాల్లో ఒక చెక్క పార్టిషనూ, కిచెన్లో ఒకటి. పక్క పోర్షన్లో మ్ముడు రూముల్లో మా అన్నయ్య. వచ్చి వరండాలో సామాను పెట్టి బెల్లు కొట్టాము. తలుపు తియ్య లేదు. మా తాళం  చెవి ఆయన దగ్గరే ఉంది. 20 నిమిషాలు బెల్లు కొడుతూనే ఉన్నాము. తియ్యలేదు. చివరికి మా వదిన తలుపు తీసి లోపలికెళ్ళి పోయింది. ఆ రోజు ఎలాగో అక్కడే గడిపి, మర్నాడు మా ఇంట్లో కెళ్ళాము. కొత్త జీవితం ప్రారంభం. గ్యాస్ స్టవ్  లేదు. మామూలు జీవితం. మా పెద్ద చెల్లెలుని ఇంటర్లో చేర్చాలి. అదంటే నాకు ఆరో ప్రాణం. ఒక్క క్షణం వదిలే వాణ్ణి కాదు. ఏమడిగినా సిద్ధం. అప్పు చేసైనా  సరే కొనే వాణ్ణి.  ఈ విషయంలో మా పిరికి భీమసేనుడి అభిప్రాయం.  ముఖ పుస్తకంలో.


Sudhakara Rao Neelamraju
May 18 ·
It is true that I did not come to Hyderabad asI was in Shaghai.Atleast whether you waited till your elders to come.Do you remember that the utterences you made in front of the public and Purohit. You already killed when she was alive..What makes you to burn the pyre when the younger bother was there. Are you proud of the actions. "You don't havr thr patience to wait till the elder sister of your wife to get marry."You ruinrd her life also..For all five brothers and sisters there is only one mother. We can can not cut in to her pieces. It it is her wish to stay back with you for reasons well knowno you. (Verbatim. No corrections made. sic.)


ఆయన కోసమే వ్రాసిన కొన్ని పద్యాలు. సామాజిక స్పృహ ఉన్నవారెవరైనా ఇవి చదివి నిజం తెలుసుకుంటారు.

1.నీట నుండు చేప నీట నుండగ నీక
వలను వేసి తీసి వాస నందె
మత్స్య ముండు నీటె ముత్య ముండును గద
వాణి బలుకు మాట నాదు నోట! 156

(దుర్మార్గుడని తెలిసి కదిలించి, కవ్వించి వాడు నన్ను తిట్టాడు బాబోయ్ అని పెళ్ళాం దగ్గరేడిస్తే ఊరుకో పిరికి వెధవా అంటుంది. చేపలు పట్టడమెందుకు. వాసన అని ఏడ్చుడెందుకు. అదే సముద్రంలో ముత్యాలుంటాయి, వాసన రావు. ఓపిగ్గా కూర్చుని పట్టు కొమ్మని సారాంశము. చేపల్ని వాటి మానాన వదిలెయ్యి. నచ్చిన వారు పట్టుకుంటారు).నీట నుండు చేప నీట నుండగ నీక
2.
అన్న దమ్ము మధ్య యాత్మ కధల ఘోష
పోయినొళ్ళ యాత్మ పొగను బెట్ట
నీదు లోపములను నిలువెత్తు జూపరో
వాణి బలుకు మాట నాదు నోట

3.
తనదు కడుపు మాడ్చి తనయుల బెంచగ
యామె పోవు వేళ యొకడు లేడాయె
యల్లు డొచ్చి బలుకు యెకసక్కె మాటలు,
వాణి బలుకు మాట నాదు నోట! 151
 (మనిషి కట్టె యయ్యాక మోయడానికి దొరికిన వ్యక్తే బ్రహ్మ ఙాని. అయిన వాళ్ళు తప్పించుకుంటే ఉన్న వాళ్ళే మోస్తారని సారాంశము)

4.
బతికి యుండగ బుండు వాసన వెగటాయె
శవము చూడ కొంత సమయ ముంచు
యనెడి బుత్రు నేమి యనెడు శాస్త్రములును,
వాణి బలుకు మాట నాదు నోట!
(తల్లి మంచాన బడి పుండ్ల వాసనతో ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్న కొడుకు మీద ఏనాడూ తల్లి మంచం దగ్గర లేకుండా, కుళ్ళి శల్య మౌతున్న శవాన్ని ఇంట్లో ఉంచుకో మేము రెండు రోజుల తరువాత వస్తామూ,అమ్మని చివరి సారిగా చూడాలి అని శవ పంచాయతీ పెట్టే ప్రబుద్ధుల గురించి చిన్న ఆట వెలది)


5.
బతికి చెడిన వాడు బతికించు ఇతరుల
చెరచి బతుక నెంచ చేరు యముని
చీమ కుట్ట గానె చేరదె కాలుని
వాణి బలుకు మాట నాదు నోట
6.

అన్న దమ్ము నడుమ యగ్గి రాచల్లుడు
యత్త మామ నెటుల యాదరించు
కాడు బోవు వేళ కట్నంబు యడుగడా
వాణి బలుకు మాట నాదు నోట

7.
అన్న దమ్ము చెల్లి యనువు నుండగ
అల్లు డేల మిమ్ము గిల్లు చుండు
కట్న మడుగ చేరు కటకటాల వెనుక
వాణి బలుకు మాట నాదు నోట

8.

సోదర బ్రేమ బోయి స్వార్ధమ్ము నిండగ
బయటి వారి నడుమ పల్చనవరో
మిత్ర భేద కధను మరచితి రెటులయా
వాణి బలుకుమాట నాదు నోట

ఇక్కడ మీకు రెండు విషయాలు బోధ పడతాయి. ఆయన మూర్ఖుడు,  పిరికి వాడు, తను చెప్పిందే వేదం అని పట్టు బట్టే మనస్తత్వం. మహా పిరికి. కానీ ద్వేషమనేది ఆయన్ని దహిస్తూనే ఉంది. ఇంకా చాల ఉన్నాయి చెప్తే. ఇక్కడ నా భార్య కుటుంబ వ్యవహహారాన్ని బయటకు తెచ్చి, తన భార్య కుటుంబం గురించి  (నాకు సంబంధించనిది), తన వియ్యంకుడి కుటుంబం గురించి చెప్పే అవకాశం ఇచ్చాడు. అవసరమనిపిస్తే చెప్తాను. నా బ్యాంకులో ఏమి జరిగిందో నా మీద ఆరోపణలూ దాచకుండా చెప్పాను. మౌనమే సమాధానం. వాళ్ళ బ్యాంకులో ఏం జరిగిందో నేను రుజువులతో బయట పెట్ట గలను. కానీ నాకేం అవసరం? ఇది నా కధ ఊళ్ళో వాళ్ళది కాదు కదా?  ఆయన దగ్గర డబ్బుంటే నా దగ్గర అమూల్యమైన సంస్కారం ఉంది. నా భార్య అక్కకు పెళ్ళి కాకుండా నేను పెళ్ళి చేసుకున్నానని ఆయన ఆరోపణ.  ఆ సందర్భంలో వివరిస్తాను. సాక్షులు  చాలా మంది. తరువాత ఇది ఎలాగైనా చెప్పే వాడిని.

ఇక జీవిత భీమా ఆఫీసులో నా జీవితం. చాలా ఒడిదుడుకుల తర్వాత, కుటుంబం స్థిర పడింది. మా చెల్లెల్ని చేర్చడానికి అన్ని కాలేజీల్లో సేట్లు అయి పోయాయి. అదే సంవత్సరం నారాయణ గూడాలో రామ భద్ర కాలేజని తెరిచారు. ఎక్కడా సేట్లు దొరకని వాళ్ళు అక్కడ చేరారు. మా చెల్లెల్ని తీసుకెళ్ళాను. ఆ ప్రిన్సిపాలు నన్ను చాలా గౌరవంగా చూశాడు. మొదటి సారి నా సైజు మీద మాట్లాడని వాడు ఆయనే. పేరు గంగాధరం. మా చెల్లెలు మార్కులు చూసి ఎగిరి గంతేశాడు. ఇన్ని మార్కులొచ్చినమ్మాయిని మా కాలేజీలో ఎందుకు చేరుస్తారు అన్నాడు. తప్పదు, మా ఇంటికి దగ్గర అని అబద్ధం చెప్పాను. ఇంతకీ ఎన్ని మార్కులో తెలుసా . 365/600 కి. ఏమీ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మా చెల్లి. అప్పటికి బంగారు తల్లి. "నీ పాదముపై పుట్టు మచ్చనై చెల్లెమ్మా" అని తరువాత వందేమాతరం రాసి పాడితే సినిమా చూసి వలా, వలా  ఏడ్చాను. అది మాత్రం నేను తన జీవితంపై పెద్ద బురద ముద్ర లాగానే చూసింది తరువాత రోజుల్లో. అన్నీ  వస్తాయి. ఇదో ఉద్గ్రంధం.

చాలా ఎక్కువ ఫీజు. అప్పు చేసి కట్టాను. అప్పులు చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య అయ్యింది చిన్న తనం నుంచీ. అప్పులు చేసే వాడిని. వడ్డీలు కట్టేవాడిని. వడ్డీలు  కట్టడానికి మళ్ళీ అప్పులు చేసే వాడిని. నేను అనుభవించింది చాలా తక్కువ. వేరే వాళ్ళు అనుభవించిందే ఎక్కువ. (ఒక సారి ఒక సర్దార్జీ నన్నడిగాడు "మేనేజరు గారి పిల్లలకి ఇంత మామూలు డ్రస్సులా? తిండి పెడుతున్నారా లేదా? అంత పేద వాళ్ళుగా ఎందుకు పెంచుతున్నారు" అని. గర్వం పెరగ  కూడదని, నా దగ్గర డబ్బుల్లేవు కాబట్టి అని  చెప్పాను . నేను ఇస్తాను అన్నాడు. వద్దు అని చెప్పాను .  ఆయనే తరువాత నేను చాలా మంచి వాడిని అని బ్యాంకులో బల్ల గుద్ది వాదించాడు. ధన్యుణ్ణి, సర్దార్!  నా భార్య కూడా చాలా చవక రకం చీరలు వేసుకొనేది. బంగారం లేదు. సదా కృతఙ్నుడిని.)

కాలేజీలో చేరాక మా చెల్లికి చాలా ఖరీదయిన డ్రెస్సులు కొన్నాను. మంచి బ్యాగు, ఏమి అడిగితే అది. తండ్రి లేడు అనే లోపం లేకుండా చూశాను. (దాని పెళ్ళయ్యాక వాళ్ళ మామగారు నన్ను వేనోళ్ళ పొగుడుతూ, నీ లాంటి మనిషిని నిన్నే చూసానొయ్, అని వ్రాసిన ఉత్తరం ఇంకా నా దగ్గర ఉంది. ప్రచురిస్తాను. హైదరాబాదులో ఉంది). దాన్ని చెడగొడుతున్నావు అని మా అన్నయ్య, అమ్మా, తమ్ముడూ అందరూ తిట్టే వాళ్ళు. దాని పేరు తలుచుకుంటే  నాకు ఆనందం వేసేది. దానికి కన్నీళ్ళొస్తే ఏడిచే వాడిని. అదే నా ప్రపంచం. ఇదెందుకు చెప్పానంటే నేను చేసిన అప్పులు రామదాసు లాగె సత్కార్యానికే పోయి, నేను శిక్ష అనుభవించాను, రామదాసు లాగా. "నువు కులుకుతూ కూర్చుండేవు"  అని చెప్పలేను కదా. దాని వైభోగం నాకు ఆనందమే ఇప్పటికీ. నాకు అసూయ అంటే తెలియదు.
నా పెద్ద కూతురికి దాని పేరే పెట్టాను. లక్ష్మీ రాజ కుమారి అని. వాళ్ళ మామగారికి ఆనందంగా వ్రాశాను. ఆయన బ్రతికి ఉండే వాళ్ళ పేర్లు పెట్ట కూడదు అని వ్రాశారు., లక్ష్మీ కుమారి అని పెట్టాను. మరి నా భార్య సంతోషంగా ఒప్పుకుంది కదా. ఆమె కూడా స్త్రీ కాదా, వీళ్ళ లాగా?

సరే! ఇక ఆఫీసు.   భీమా సంస్థలో  అప్పట్లో వింత పరిస్థితులు ఉండేవి. చాలా బలమైన  కమ్యూనిస్టు    యూనియను. బీ జే పీ వాళ్ళ యూనియన్లో చేరాను. అప్పట్లో నేను బలమైన కాంగ్రెస్సు వాదిని. కమ్యూనిస్టులన్నా,  బీజేపీ అన్నా  కోపముండేది. (జన సంఘ్) దీనికి మా నాన్న గారి ప్రభావం ఎక్కువ. (ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు కాలేజీలో రొటరాక్ట్ క్లబ్బు లో ఉన్న పేరు చూసి ఏ బీ వీ పీ వాళ్ళు కాలేజీలో ఉండగా  నన్ను మెంబరుగా చేర్చారు. నేను ఆర్ ఎస్స్ ఎస్స్ కి పూర్తి వ్యతిరేకం. వాళ్ళకి చెప్పాను. నా అభిప్రాయాలు  మారవని. నిద్ర లేస్తె చదవడం నాకు జన్మతః వచ్చింది. తింటూ కూడా చదివే వాణ్ణి. దాంతో రాజకీయాల మీద ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి. ఇప్పటి పిల్లలకి కూడా అదే చెప్తాను. చదవండి. దేశానికి ఉపయోగ పడుతుంది అని)   అయినా చేర్చుకున్నారు. వెంకయ్య నాయుడంటే చాలా గౌరవముండేది. ఆయన మీటింగులన్నీ వినే వాడిని. విశ్లేషించే వాడిని. మర్నాడు చర్చ పెట్టే వాడిని. ఆయన్లో తప్పులు వెదికి మరీను. అప్పుడే రాజకీయ విశ్లెషణ చెయ్యడం ప్రారంభించాను. నా వాదనలు చాలా  మంది వినే వారు.  నా ప్రాణ స్నేహితుణ్ణి కూడా చేర్పించాను. ఆ సమయంలో విజయవాడలో ఒక పెద్ద సదస్సు జరిగింది. నన్ను, మా స్నేహితుడినీ మరి కొంత మందినీ మా వూరి నుంచి పంపారు, కార్యకర్తలుగా. ప్రొద్దున్న గడిచింది. రాత్రి అందరికీ క్రింద చాపలేసి పడుకోమన్నారు. కొంతసేపు  పడుకున్న తరువాత సంశయ మొచ్చింది. నాయుడు గారెక్కడ  అని. హోటల్లో పడుకున్నారు అని. ఏ సీ హోటలు. ఆయన ఇక్కడికి రావాలి, లేదా మాకు కూడా హోటల్లో రూము లివ్వమని అన్నాను. అందరికీ కోపమొచ్చింది. క్రమశిక్షణ అన్నారు. ఆయనకు లేని క్రమ శిక్షణ  మాకెందుకు అన్నాను. పెద్ద గోల అయ్యింది. కొందరు అటూ, కొందరు ఇటూ. ఏమయ్యిందో తెలియదు. మీకు ఇష్టం లేక పోతే వెళ్ళి పొండి అన్నారు. మేము కొంత మందిమి వెళ్ళి పొయ్యాము. వెళ్ళెటప్పుడు చెప్పాను, నాయకుడు కార్యకర్తల్తో కలిసి ఉండాలి. ప్రత్యేక మైన సదుపాయాలు ఉండకూడదు అని. ఆ కధ అంతటితో ముగిసింది. వాళ్ళు నన్ను తీసేశారు ఏబీవీపీ నుంచి.(కానీ ఈ సంఘటనకి, నా కాంగ్రెస్సు మీద ప్రేమకీ ఏ సంబధం లేదు. ప్రతిదీ విశ్లేషించే అలవాటు వేణ్ణూలుకుంది)

భీమా సంస్థలో ట్రైనింగు అయి పోగానే సరెండర్స్ అనే సెక్షన్లో వేశారు. 12 ఫైళ్ళు ఇచ్చారు. పక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఆ రోజు 4 గంటల వరకూ పట్టింది. రెండో రోజు 12 గంటల కల్లా పని అయి పోయింది. ఆఫీసరు కిచ్చాను. ఇంకా చేస్తావా అని అడిగాడు. అవుననన్నాను. ఇంకో 20 ఇచ్చాడు. ఇది పక్క సెక్షన్లో కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి తెలిసింది. కోప్పడ్డారు. నీ లాగా మేము పని చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయా? నువ్వు పెండింగు పెడితే ఇంకొంతమందికి ఉద్యోగాలొస్తాయి అని గీతోపదేశం  చేశారు. (తరువాత వచ్చిన యమ గోల సినిమాలో "మేము పని చెయ్యం, ఇంకోళ్ళని చెయ్యనివ్వం అని రామా రావు చెప్తాడు. పశ్చిమ బెంగాలులో ఇది ఇప్పటికీ నడుస్తుంది). ఏం చేస్తాం. మరునాటి  నుంచీ రెండు గంటలు బయటా, రెండు గంటలు సీట్లో అలవాటు చేసుకున్నాను.తరువాత నెమ్మదిగా బస్ స్టాపుల్లో నిలబడటం అందమైన అమ్మాయిలని చొంగ కార్చుకుంటూ చూడడం, 11 గంటలకి (అప్పుడు రాక పోతే సెలవు పెట్టాలి) రావడం అలవాటయ్యింది. ఇక్కడే  ఇంకో ఐదుగురు నా లాటి యూనియన్  బాధితులు తగిలారు. అందరం బస్ స్టాపుల్లో తిరిగే వాళ్ళం. ప్రొబేషన్ అయి పొయ్యాక కొత్త పద్ధతి కనుక్కున్నాం. అక్కడికి దగ్గర్లో మీర టాకీసు. వారానికి కొత్త సినిమా. ప్రతి వారం సంతకం పెట్టడం, పక్క సెక్షన్లో పని ఉందని నాలుగు చిత్తు కాగితాలు పట్టుకుని సినిమా చూసి, లంచ్  చేసి వచ్చి గంటలో పని పూర్తి చేసే వాళ్ళం. కొన్నాళ్ళయ్యాక సెక్షన్ మార్చారు. ఇది ప్రీమియంస్. ఇక్కడ ఒక షీటు ఇచ్చే వారు. జర్నలు. దాంట్లో పాలిసీ  నంబర్లుండేవి. అవి చూసి లెడ్జర్లలో  తేదీ వ్రాయడం, నంబర్ సరి చూసుకుని. 250 కోటా. మొదటి రోజు అర గంటలో పని అయ్యి పోయింది. జీతాలు పెరుగుతూనే ఉన్నాయి. లాభం లేదనిపించిది. రెండో రోజు 1000, మూడో రోజు 2000, ఇలా 10,000 వరకూ వెళ్ళాను. ఆ సెక్షనుకి ఒక ముస్లిం సెక్షన్ హేడ్ ఉండేవాడు. ఆఫీసరుకి చెప్పాడు. తొందరగా  చేస్తున్నాడు, తప్పులు పోతాయని. యూనియన్ వాళ్ళొచ్చారు. నా ఇష్టం అని చెప్పాను. ఆఫీసరు మీద అరిచి వెళ్ళారు. అప్పుడు దైవ సహాయం అని మళయాలీ ఆఫీసరు. వాళ్ళ ఎదురుగా నన్ను కోప్పడి "నువ్వు ఎదిరించ దలచుకుంటే రేపు 15,000 చెయ్యి. నేను అండగా ఉంటాను. అని చెప్పాడు. చేశాను. ముకుందన్ అని డివిషనల్ మేనేజర్ నన్ను పిలిచి నన్ను పిలిచి నా సర్వీసులో ఎవరూ చెయ్య లేని పని చెశావోయ్  అన్నారు. అంతే. వేల మంది పని చేసే ఆఫీసులో నా పేరు మోగింది . నా బ్యాచులో నలుగురూ కూడా యూనియన్ కి ఎదురు తిరిగారు. మొత్తం మారి పోయింది. కోటా సిస్టం గోవిందా. దాని తరువాత జే ఆర్ కే మూర్తి అనే ఆఫీసరు వచ్చాడు. ఆయన నన్ను తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీసు నుంచి కొంత మందిని 90 రోజుల సర్వీసు మీద తీసుకునే వారు. ఎక్కవ మంది మా సెక్షనుకే వచ్చారు. వాళ్ళకి నన్ను బాసుని  చేశాడు.  రోజూ మా సాయుబు గారితో తగాదేనే. అందర్నీ చెడగొడుతున్నాడు. ఇలా అయితే పని అంతా అయి పోతుంది. నన్ను ట్రాన్స్ఫర్  చేస్తారు అని. ముష్టి యుద్ధాల దాకా వెళ్ళేది. కుర్ర బ్యాచ్ అంతా నా వెనకాలే. అప్పుడే ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని పెళ్ళి చేసుకొమ్మని అడిగారు. రోజూ లంచ్ లు, గిఫ్టులు ఇలా ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని చూసే వారు. ఆ జీవితమే జీవితం. ఏ సెక్షన్ కెళ్ళినా చాలా మర్యాదగ చూసే వాళ్ళు, పని చెయ్యడం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది. ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను మొదలు పెట్టాక, యూనియన్  కేవలం మీటింగులకే పరిమిత మయ్యింది. సంవత్సరంలో నేను, నేనుగా గుర్తించ బడ్డాను. పొట్టి రెబెల్ గా.

మన జీవితంలో మనకున్న ఒకే ఒక్క గౌరవం మనమేంటో ప్రక్క వాళ్ళు గుర్తించడం. నా విషయంలో అది అక్షరాలా నిజమయ్యింది. నా జీవితమే ఓ సందేశమయ్యింది. వ్యవస్థకు ఎదురు తిరగల్సిందే అనే నా పట్టుదల ఇంకా పెరిగింది. గర్వమూ పెరుగుతుంది కదా?


                                                      ##########################

వచ్చే భాగంలో, ఇంకా కొన్ని వింతలూ, భీమా సంస్థకు వచ్చిన నా భామ, ప్రేమా, పెళ్ళీ అన్నీ త్వర, త్వరగా. జీవితంలో పెను మార్పులు.


You have enemies? Good. That means you've stood up for something, sometime in your life.