Thursday, June 4, 2015

సాగర మధనమనే నా స్వీయ చరిత్ర నాలుగో భాగం తెలుగు అనువాదం- కళాశాల రోజులు - కొత్త అవకాశాలు- కొన్ని నిచ్చెనలు- పెద్ద పాము

జీవితం ఒక క్లిష్టమైన ప్రయాణం. తర, తరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని  ఒక తుప్పు పట్టిన వాహనంలో,గుంటలు, గుట్టలతో నిండి ఉన్న రహదారిపై ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ప్రతి పిల్లవాడికీ, బిడ్డకు సొంత వాహనం నడిపించే శక్తి వచ్చాక, వారికి నూతన పరికరాలతో వచ్చిన సరికొత్త వాహనాన్నిచ్చి, తోడుగా ఉండడానికి ఒక జీవిత భాగ స్వామి నిచ్చి సరి కొత్త రహదారిపై  వారిని వదిలి "మీ ప్రయాణం సుఖంగా సాగించండి" అని ఆశీర్వదించి  వదులుతారు. ఈ రహదారి పై అనేక వేగ నిరోధకాలు కూడా ఏర్పరిచి మరీ వదులుతారు. ఇలాగ చివరి సంతానం కూడా రహదారిపై వెళ్ళాక వారి ప్రయాణాన్ని తమ పాత వాహనంలోనో, లేదా ఏదో ఒక బిడ్డ, పిల్ల వాడి వాహనంలోనో కొనసాగిస్తారు తమ జీవన ప్రయాణం కొన సాగే వరకూ.

ఎంతో క్రమశిక్షణ గల వాహన చోదకులుగా వారికి శిక్షణ ఇచ్చినప్పటికీ ఈ పిల్లల్లో కొందరు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులనే అంతః శత్రువులకు బానిసలయ్యి గానీ, లేదా తమ భాగస్వామి  ప్రోద్బలంతో గానీ వారి వాహనాలని మనః పూర్వకంగా కానీ, లేదా అదుపు లేకుండా కానీ నడిపి కానీ తమ అన్న దమ్ములూ, అక్క చెల్లెళ్ళ లోనే వేరే వారికి కోలుకోలేని దెబ్బలు తగిలేలా ప్రమాదాలు సృష్టిస్తారు. ఈ ప్రమాదాలు వీరికి సంబంధించని ఇతర వాహన చోదకులు కూడా చేయవచ్చు. మనిషి  సంఘ పరంగా జంతు జాతికి చెంది కలిసి, మెలిసి   ఉండవలసిన వాడు, ఈర్ష్యా, ద్వేషాలకు బానిసయ్యి ఇతర జంతువులని పీక్కు  తినే క్రూర మృగంలా తయారవుతాడు.

కొంతమంది వాహన చోదకులు మితిమీరిన వేగం వలననో, అహంభావంతోనో లేదా ఇతర వాహనాల పట్ల సరైన సమయంలో అప్రమత్తంగా ఉండకపోయి సరైన దారిలో తన జీవన శకటాన్ని నడప లేక పొవడం వలననో ఏ పెద్ద చెట్టుకో గుద్దుకొని తిప్పుకోలేని గాయాల పాలవుతారు. లేదా తమ కున్న శిక్షణ తోనో, క్రమ శిక్షణ తోనో మరల తిప్పుకొని ప్రయణాన్ని సాఫీగా సాగిస్తారు. నేను ఈ వర్గానికి చెందిన వాణ్ణీ కాగా (జీవితంలో చాల పట్టుదలతో మళ్ళీ నిలబడ గలిగాను) నా అన్నదమ్ములూ, అక్క చెల్లెళ్ళలో కొందరు మొదటి వర్గానికి చెందిన వారు.

ఈ తరం మారి, కొత్త వాహనాలు, కొత్త రహదారులపై తీసుకుని, ఒక జీవిత భాగస్వామితో మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టిన వారికి పాత చోదకులు తమ పద్ధతి లోనే ప్రయాణం సాగించ మని గానీ, లేదా తమ ప్రయాణాల్లో ఎదురైన సమస్యలను అధిగమించి నూతన పద్ధతుల్లో ప్రయాణం సాగించమని గాని  చెప్పి వారి ప్రయాణాన్ని ముగిస్తారు. ఈ అనంత ప్రయాణం ఎన్నో యుగాలుగా సాగుతూనే ఉంది. లేదా సూర్య భగవానుని కడుపున పుట్టిన కర్ణుడు దుష్టులతో కలవడమేమిటి?  రావణాసురుడి సోదరుడు రాముడితో కలవడమేమిటి? అంతా కర్మ ఫలము, జన్మ సంస్కారము, నేర్చుకున్న విద్యలపై ఆధార పడి ఉంటుంది. మరి కొందరు ఇతరుల వాహనాల్లో ఇంధనం వాడుకుని, వారికే ద్రోహం తలపెట్టాలని చూస్తారు. వీరు శకుని కోవకు చెందిన వారు.

నేను కూడా అహంభావంతోనో, మితి మీరిన వేగంతొనో,లేదా ఇన్ని వేగ నిరోధకాలా ఈ చిన్న జీవితానికి అని అసనహంతోనో, ఇతర వాహనాలు నాకు ప్రమాదం కలిగించ వచ్చు అనే విషయంలో జాగరూకత వహించి సరైన సమయంలో, సరైన దారిలో నా వాహనాన్ని మళ్ళీంచ లేక పొవడం మూలకంగానో లెదా వీటన్నటి సగటు మూలకంగానో జీవిత ప్రయాణంలో అత్యంత కీలకమైన  దశలో నలభై ఏళ్ళ వయసులో వాహనాన్ని మరల నడించడానికి సరిపడా ఇంధనము (ధనము) లేకుండా ఒక పెద్ద చెట్టుకి ఢీకొని ప్రమాదంలో చిక్కుకున్నాను.  కానీ మా వాళ్ళందరూ అభ్యంతరం  చెప్పినా నేను ఎన్నుకున్న నా భాగస్వామి, ఆమె చేతిలో శిక్షణ పొందిన నా పిల్లల అత్యంత ఓర్పు వల్ల, నాకు సహజంగా ప్రాప్తించిన తెలివి వల్లనో కోలుకుని, తప్పు తెలుసుకుని మళ్ళీ జీవితాన్ని మరింత నునుపైన రహదారిపై సాగిస్తున్నాను. ఈ కారణం వల్లనే నా చరిత్ర తరువాతి తరాలకి చెప్పి వారినైనా సక్రమమైన మార్గంలో నడవమని చెప్పడమే నా ప్రయత్నం. ఈ కారణం వల్లనే నా చరిత్ర ఈ మలుపు తిగింది.

లేదా ఈ చరిత్ర వేరే విధంగా ఉండేదేమో!

నా మూడో అన్నగారు నా మీద నా బ్యాంకులో మోపిన ఆరోపణలని "బయట పెట్టు చూద్దాం" అని పదే, పదే ప్రేరేపించి ఒక్క సారి నేను ఆ విషయం బయట పెట్టాక "చూశారా, ఎంత దుర్మార్గుడో" అని పైశాచిక ఆనందం పొందాలని ప్రయత్నిచడం వలన (ఎందుకంటే, నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన పూస గుచ్చినట్లు చెప్పడం వలన)
ఎప్పుడో ముందు భాగాల్లో రావలసిన ఈ ఆరోపణలను సమయానికి చాలా ముందే ఈ భాగంలోనే రాయాలనుకున్నాను. బ్యాంకుల తీరు తెలిసిన చాలా మంది," అవును! ఇవి చాలా బలమైన ఆరోపణలు, దీనికి శిక్ష ఉద్యోగంలోనుంచి తీసి వేయడమే" అన వచ్చు. కానీ ఈ సమయంలో ఈ ఆరొపణల తీవ్రతపై  చర్చించదలుచుకో లేదు. తీవ్రమైనవి కావు అని ఖండించ దలుచుకో లేదు. తరువాయి  భాగాల్లో  ఈ పదింటిలోనూ ఎనిమిది ఎందుకు తీవ్రమైనవి కాదో, మిగిలిన రెండిటిలో నా ప్రమేయం చాలా తక్కువ ఎందుకో వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే, ఈ విషయాన్ని మరింత సాగదీసి నా జీవితాన్ని, మరో తొమ్మిది మంది జీవితాల్నీ సందిద్ఘావస్థలో పెట్టడం  ఇష్టం లేక నేనే తీవ్రమైన శిక్షను అనుభవిచడానికి సిద్ధ పడ్డాను.

అయితే నేను చేసిన ప్రతి లావా దేవీ, ఆ రోజుల్లో, కనీసం, మా బ్యాంకులో సర్వ సాధారణంగా జరిగే లావాదేవిల్లో భాగమే. దీనికి ఒక అధికారి కేవలం లంచగొండి అయితేనే చేస్తాడనడానికి వీలు లేదు. డబ్బు ఆశించి చేసే వాళ్ళు ఉండొచ్చు. నా మీద అల్లాంటి  ఒక్క ఆరోపణ నా ఆరోపణ పత్రంలో లేదనే   విషయాన్ని గమనించాలి. చివరికి ఆ ఆరోపణ మీద నన్ను తీసి వేయలేదు కూడా. "బ్యాంకు సంప్రదాయాలకు విరుద్ధంగా లావాదేవీలు చేశావు  కాబట్టి" అనే వాక్యం చాలా పెద్ద పరిధి కలది. అదే ఆరోపణైతే మా బ్యాంకులో కింద నుంచి పై దాకా సగం మంది ఉద్యోగాల్లో ఉండ కూడదు. ఈ విషయాన్ని  ముందు భాగాల్లో పేర్లతో సహా, సోదాహరణంగా ఋజువు చేస్తాను. బ్యాంకు వారు కావలసిన చర్య తీసుకొవచ్చు.

మా అన్నగారి అసూయ, అహాల్ని తృప్తి పరచడానికే ఈ ఆరోపణల్ని సమయ పాలన లేకుండా ముందు ప్రచురిస్తున్నాను. దీని మూలకంగా, నా జీవితంలో ప్రతి మెట్టు దగ్గర నన్ను కరచిన పాముల జీవితాలపై నాకు హక్కు వస్తుంది. ఈ హక్కుతో నేను వారి, వారి వ్యక్తిగత జీవితాలలో జరిగిన సంఘటనలను కూడా ప్రస్తావించి సమాజంలో తలెత్తుకోకుండా చెయ్య వచ్చు.

కానీ, నా ఉద్దేశం మొదటి నుంచి అది కాదు. ఇప్పుడూ అది కాదు. కేవలం నా తప్పుల్ని ఒప్పుకొని, దాని వెనుక ఉన్న అతి బలమైన కారణాల్ని చెప్పడమే నా ప్రయత్నం. (కొన్ని బలహీన కారణాలను వదిలేశాను). ఇది ఒక "ప్రతీకార కధ" కాదు. కాని మన రాజ్యాంగం ప్రకారం (21 and 14) ప్రతి వారికి సమాన హక్కులుంటాయి. ఒకరికి ఫోను మీద బెయిలు వచ్చి ఇంకొకరు సంవత్సరాల తరబడి కారాగారాల్లో  మగ్గడం మన రాజ్యాంగం నిర్దేశించింది కాదు. కానీ ఈ ప్రాధమిక హక్కును కూడా వదిలేసుకుంటున్నాను.

గీతలో కృష్ణుడు  చెప్పినట్లు " అందరూ నా చేతిలో శిక్షింప బడే వారే. అందరూ నా చేతిలో పోవు వారే" అన్న సందేశం ప్రకారం నా బాధ్యతగా, వీరిలో కొంతమందిపై, వారి జీవితాలపై ప్రభావం చూపకుండా నా పరిదిలో నేను ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాను. ముందు భాగాల్లో.నా పై వచ్చిన ఆరోపణల  పత్రము.

1. నేను నాకు బ్యాంకుచే  ఇవ్వ బడిన అధికారాలని మించి ఇద్దరు ఖాతా దారులకి ప్రతి ఒక్కరికీ 15 లక్షల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చాను. దీని మూలకంగా బ్యాంకుకి 4,65,000 రూపాయల నష్టం వాటిల్లింది. (ఈ గ్యారంటీలు  పూర్తిగా బ్యాంకు డిపాజిట్లు,ఆస్తులూ వగైరాలతో పూర్తి రక్షణలో  ఉన్నాయి.(secured totally)

ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించడం సబబుగా ఉంటుంది. నేను హైదరాబాదు ప్రధాన శాఖలో బ్రాంచ్ మేనేజర్ తరువాతి పదవిలో ఉన్నఫ్ఫుడు (సబ్ మేనేజర్, 30 యేళ్ళ వయసులో)  ఒక రాజకీయ నాయకుడికి  చెందిన రెండు సంస్థలకు, ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన మౌఖిక ఆదెశాల మేరకు 24 లక్షలూ, 15 లక్షలూ రెండు దఫాలుగా తాత్కాలిక అప్పు కింద వారి ఖాతాలో ఇచ్చిన సందర్బాలున్నాయి.ఈ అప్పులకి ఏ విధమైన ఆస్తులూ రక్షణగా ఉండవు. unsecured loans  ఇదే సమయంలో ఇదే సంస్థకి చెందిన ఒక మీడియా సంస్థకు ఇంకో శాఖలో మూడు లక్షల రూపాయలు ఇదే విధమైన అప్పు ఇచ్చి, ఒక మేనేజరు కనీసం ప్రధాన కార్యాలయానికి కనీసం తెలుపకుండా సంవత్సరాలు గడిపాడు. ఏ ఆడిట్ లో ఎంత రాసినా ప్రధాన కార్యాలయం అతనిపై చర్య తీసుకోలెదు. కారణం నేను చెప్పనక్కర లేదు. పేర్లు సమయం వచ్చినప్పుడు.
         

2. నేను కొన్ని బ్యాంకు  గ్యారంటీల  మీద వసూలు చేయవలసిన విధంగా commission  వసూలు చెయ్య లేదు. నష్టం నలభై వేలు. (ఇది కోడి గుడ్ల  మీద ఈకలు పీకడమే. ఎందుకంటే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నష్టం 5 లక్షలు దాటితే ఉద్యోగంలోనుంచి తీసి వేయ వచ్చు. ఇవి Central Civil Service Rules.మాకు కూడా వర్తిస్తాయి. అంటే నేను బ్యాంకు పై యుద్ధం చేసినా ఈ వంకతో తీసి వేయ వచ్చు. రెండో పద్దతి కాళ్ళ మీద పడటం. అప్పటికీ, ఇప్పటికీ నాకు చేత కానిది  ఇది ఒక్కటే.

3. నేను ఒక మతానికి, ఒకే కుటుంబానికి చెందిన చాలా మందికి రవాణా వాహనాల అప్పులు ఇచ్చాను. ఇవన్నీ మా ప్రాంతీయ  కార్యాలయం వారు మంజూరు చేసినవే. ఈ కుటుంబాల్ని ఎంతో బెదిరించారు, నేను లంచం తీసుకున్నాను  అని వ్రాత పూర్వకంగా తీసుకోవడానికి. దాంట్లో ఒక అరవై ఏళ్ళ పెద్దాయన రాసిచ్చాడు. మేము మిఠాయి పొట్లాం మేనేజరు గారి పిల్లలకిస్తే తన ఉద్యొగస్తులకి పంచాడు , ఆయన. కోప్పడి ఇంకో అర కిలో కొనిచ్చాను  అని. ఆయన ఎక్కడున్నా నా నమస్సులు.

4. ఈ సందర్భంలోనే ఇదే కుటుంబానికి చెందిన ఇంకొకరికి ప్రాంతీయ కార్యాలయం నుంచి మంజూరు  రాకుండానే 1,70,000 రూపాయలు  వాహన ఋణాన్ని ఇచ్చాను. ఈ అప్పు అతను సక్రమంగానే   కట్టాడు. సంపాదించిందంతా మా దగ్గరే  డిపాజిట్లు పెట్టాడు.

5. నేను రెండు బ్యాంక్ గ్యారంటీలు  పుస్తకాల్లో రాయకుందానే ఇచ్చాను. ఇది వాళ్ళు రుజువు చెయ్యలేకపొయ్యారు. ఎందుకంటే ప్రతి సంవత్సర ఖాతాలో వీటి వివరాలు ఉండేవి. (ఈ ఆరోపణకు ఒక బలమైన వ్యక్తిని రక్షించడమే ఉద్దేశ్యము. తరువాత భాగాల్లో పేరుతో సహా)

6. నేను ఒక లేని వ్యక్తి పేరుతో ఖాతా తెరిచి, చెక్కు ద్వారా కాకుండా వేరే పద్ధతిలో డబ్బు ఇచ్చాను. (ఇలాంటి ఖాతాలు మా బ్యాంకులో కొన్ని వేలు ఉంటాయి. లేకపోతే ఇంత నల్ల ధనం ఎక్కడుంటుంది? ఇది వ్యవస్థ లోపం. నాది కాదు. ఇప్పటికీ ఈ ఖాతాలు ఎవరివి, ఎవరు తెరిచారు, ఎంత డబ్బు మూలుగుతుండేది, నేను ఆ బ్రాంచ్ కి మేనేజరు గా వెళ్ళిన కొత్తల్లో ఎంత మంది డబ్బు ఇచ్చి రెండో ఖాతాలో వెయ్యండి సార్ అని చెప్పే వాళ్ళు చెప్పగలను. సమయం వచ్చినప్పుడు.

7. నేను అధికార దుర్వినియోగం చేసి ప్రతి రెండు రోజులకి హైదరాబాదు నా వ్యక్తిగత పనులకోసం వెళ్ళీ 15 రోజులు లీవు ఆదా చేసుకున్నాను. (ఈ డ్యూటీ ఏమిటంటే అక్కడనుంచి 50 లక్షల సొమ్ము అద్దె కార్లో, నక్సలైట్ల ప్రాబల్యమున్న  అడవుల గుండా మోసుకెళ్ళడం). ఒక గార్డు ఉండే వాడు. అతని దగ్గర తుపాకీ పేలుతుందో లేదో తెలియదు. ఎవరూ వెళ్ళక పోతే నేనే కదా వెళ్ళాలి? ఎంత హాస్యాస్పదమండీ?

8. నేను 4 శాతం వడ్డీ మీద ఒక వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చాను. ఇది బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఆ అప్పు కట్ట లేదు. (ఈ ఆరోపణ నా మీద రావడానికి ఇంకో మేనేజరు పూర్వాశ్రమంలో పెద్ద కధ ఉంది) లక్షల  కోట్ల అప్పులు మురిగి పోతుంటే 1000 రూపాయలకి ఆరోపణ?

ఈ ఎనిమిది ఆరోపణలూ చాలా బలహీనమైనవి. నిజంగా నేను అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి  ఉంటే బ్యాంకుతో యుద్ధం చేసే వాడినేమో. కనీసం మా ఖాతాదారుల దగ్గర  కాఫీ తాగదానికి కూడా వెళ్ళే సమయం దొరికేది కాదు. బ్యాంకే  నా ప్రపంచ మనుకొని పిల్లల్ని భార్య మీద వదిలేసి పని చేశాను. ఏ ఆది వారమూ, ఏ పండగ రోజూ ఇంట్లో ఉండే వాడిని కాదు. స్వీపర్ రాకపోతే పొద్దున్నే ఏడు గంటలకి వెళ్ళి  బ్రాంచ్, కౌంటర్లూ శుభ్రం చేసే వాడిని. బాత్రూము కడిగే వాడిని.

" పది మంది కోసం నిలబడ్డ నీకు  మిగిలిందేమిటీ యమపాశం" అని అన్నాడొక కవి.

నేను ఎప్పుడన్నా ఖాతాదారుల దగ్గర  డిన్నర్ కి వెళితే మా చైర్మనూ, మిగిలిన పెద్ద అధికారులతోనే వెళ్ళే వాణ్ణి. మరి వాళ్ళు చెయ్యని తప్పు నేను చేసిందెక్కడ?

చివరి రెండు ఆరోపణలూ మాత్రం నేను ఒక తెలివి గల అధికారిగా సిగ్గు పడాల్సినవి. కానీ దీన్లో కూడా నా స్వార్ధం లేదు. బుద్ధి కర్మ ప్రకారం నడుస్తుంది. వేరే వాళ్ళ బాధ్యత నెత్తిన వేసుకుని, నీతి కధలో కుక్క పని చెయ్య బోయి చాకలి చేత దెబ్బలు తిన్న గాడిద మాదిరి ఈ నా కధ. ఈ ఆరోపణలకు అతి పెద్ద శిక్ష కింద ర్యాంకుకి పంపించడమో లేదా నాలుగు సంవత్సరాలు జీతంలో వృద్ధి లేకుండా చెయ్యడమో.

9.నల్ల  డబ్బు ఖాతాల్లోనుంచి డబ్బు తీసి బయటి వాళ్ళకి ఇచ్చాను  అనేది. ఇందులో నేను తీసుకున్నది ఏమీ లేదు. కానీ ఇది పెద్ద తప్పు. నమ్మక ద్రోహం. నల్ల డబ్బు కాబట్టి వాళ్ళెవరూ రాత పూర్వకంగా ఇవ్వలేదు. బయటి వాళ్ళు ఆ డబ్బు కట్టేశారు. ఈ పేర్లూ, వాళ్ళెక్కడ పని చేసే వాళ్ళూ  సమయం వచ్చినప్పుడు.

10. ఒక ఖాతాలో చెక్కు సొమ్ము రాకుండానే జమ చూపించాను, అనేది. ఇది నైతికంగా చాల తప్పు పని. అందులో వ్యవస్థ మీద యుద్ధం చేసే నా బోటి వాడు చెయ్యాల్సిన పని కాదు.

నేను ఏదైనా అనైతికమైన పని చెశాంటే ఈ రెండే. కానీ నన్ను తీసివేసింది బ్యాంకుకి  5 లక్షల రూపాయలు నష్టం చేశాననే ఆరోపణ పైననే.

ఏది ఎంత చెప్పినా, ఈ విధమైన లావా దేవీలు మా బ్యాంకులో చాలా సర్వ సాధారణమైనవి. అనేకమంది మేనేజర్లు ఇవే పనులు చేసే వాళ్ళు. చివరి రెండిటితో సహా. నా పై అధికారులే ఇలాంటి తప్పులు చేసి కొంతమంది తప్పించుకోగా, కొంతమంది తాత్కాలికంగా తీసి వేయబడి  రక రకాల పద్ధతులలో మళ్ళీ బ్యాంకులో చేరగలిగారు. ఇవన్నీ తరువాత. బ్యాంకులో  99 శాతం మందికి నా పైన ఏమి ఆరోపణలు చివరికి వచ్చాయో తెలియదు. నేను కూడా ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, ఎవరి సహాయమూ తీసుకోలేదు. కానీ ప్రధాన కార్యాలయం అదేశాల మేరకు వదంతులు కొన్ని వేలు  సృష్టించారు. నేను సంపాదించిన సొమ్ము దాదాపు 50 లక్షల నుంచీ ఒక కోటి వరకూ ఉండొచ్చని. (తరువాత నాలుగు సంవత్సరాలూ దాదాపు రాత్రి పూట గుళ్ళలో ప్రసాదాలు తిని బతికాను. వాళ్ళు భక్తి అనుకునే వాళ్ళు. భుక్తి కోసమే నేను వెళ్ళే వాణ్ణి.  పుచ్చిపోయిన పప్పు పిల్లలకి పెట్టాను. దేవుడే సాక్షి)

తెలివిగల ఎవరైనా ఒక ప్రశ్న  అడుగుతారు. "నిన్నే ఎందుకు బ్యాంకు వారు గురి పెట్ట వలసి వచ్చింది" అని. నేనే కాదు, బ్యాంకు  అధికారులతో ఢీకొన్న ప్రతి అధికారీ ఈ రకమైన బాధలు అనుభవించారు. "కర్ణుడి చావుకి కారణమెవ్వరు?" నేను 19-12-77 రోజున బ్యాంకులో అడుగు పెట్టిన రోజు నుంచీ జరిగిన ప్రతి సంఘటన దీనికి రుజువు.

నేనెప్పుడూ నా బాధ్యతల నుంచి తప్పించుకో లేదు. పెద్ద, పెద్ద బాధ్యతలు నెత్తిన వేసుకొడానికి భయపడ లేదు. ఎవరో ఏదో అంటారని భయపడ లేదు. తప్పు చేసి ఉండవచ్చు.  తప్పు ఒప్పుకుని బయటికి వచ్చాక ఇన్ని సంవత్సరాలు నన్ను ఒక వేట కుక్క వేటాడినట్లు  వేటాడాలా? ఏం సమాజం ఇది?

"దున్నే ఎద్దుకే దెబ్బలు పడతాయి. బాధ్యత నెత్తిన వేసుకున్నవాడు ఒక్కోసారి తప్పు చేయ వచ్చు. ప్రతి దాన్లో స్వార్ధ చింతన ఉండదు. ఇతరత్రా అనేక కారణాలుంటాయి. ఏ సంస్థలోనైనా చూడండి 30 శాతం మందే బాధ్యతగా పని చెస్తారు. వీరిలోనే దెబ్బ తినే వారుంటారు. పని చెయ్యక పోతే మన దగ్గర శిక్ష ఉండదు. చేసి తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. ఇది నేటి ఆటవిక న్యాయం. శిక్ష సంతోషంగా అనుభవించిన వాడిని వేటాడే సమాజాన్ని ఎక్కడైనా చూశారండీ? నాకు నా అన్న దమ్ముల దగ్గర ఇదే న్యాయం దొరికింది .

దీంతో మా అన్నగారి అహం, అసూయా రెండూ శాంతిస్తాయని  అనుకుంటాను.అసూయాపరులని, అహంభావులని వారి తరువాతి తరాలని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటాను.

ఇదంతా నేను బ్యాంకు నుంచి ఏదో ఫలితం ఆశిస్తూ చేశానని అనుకోవద్దు. వాళ్ళు ఇవ్వరు కూడా. ఇంకా ఏమన్న చర్యలు తీసుకండే అవకాశం కూడా ఉంది. నన్ను రక్షించడానికీ శాప విముక్తి చెయ్యడానికి రాముడూ, కృష్ణుడూ రారు. నేనే విముక్తుణ్ణి కావాలి. ఒక వేళ  బ్యాంకు దయ తలచి ఇచ్చినా ఆ పాపపు సొమ్ము నాకొద్దు. మమ్మల్ని పోషించడానికీ, కాటికి చేర్చడానికీ మా పిల్లలకి సంస్కారం నేర్పాము. వాళ్ళు మాకంటే వెయ్యి రెట్లు మంచి వాళ్ళుగా తయారయ్యారు.

నా జీవితమంతా నేను ఈ పద్యం వల్లించు కుంటూ బతికాను. ఇది పోతన భాగవతం లోనిది.


బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్యకం
గూళలకిచ్చి యప్పడుఁపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషనార్థమై.
                                      ####################################

మా అన్న గారి తృప్తి కోసం నా ఆరోపణ పత్రం  గురించి మీకు చెప్పాక మనసు తేలిక పడింది. అందుచేత, కధను మళ్ళీ నా పట్టణ ప్రవేశం వైపుకి మళ్ళిస్తాను. "To be or not to be" ఇదీ మా నాన్నగరి మనో స్థితి,  నేను 11 వ తరగతి, మా తమ్ముడు 10 వ తరగతీ పూర్తి చేసెటప్పటికి. (ఆ సంవత్సరమే 11+1+3 నుంచి 10+2+3 పద్ధతికి మారింది.) ఇద్దరమూ కాలేజీల్లో చేరాల్సిన పరిస్థితి. ఆడ పిల్లలు ఇంకా స్కూలు చదువులే. ఆ సంవత్సరం వరకూ మా రెండు, మూడో అన్నయ్యలు సైకిలు మీద 6 కిలో మీటర్లు  తొక్కుకొని కాలేజీకి వెళ్ళి వచ్చే వాళ్ళు. ఇంటి కొచ్చే సరికి వేళ్ళాడబడి వచ్చే వాళ్ళు. చదివే శక్తి కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో పట్నంలో హాస్టలు ఉందేది కాదు. మాకు చుట్టాలెవరూ  ఆ వూళ్ళో లేరు. కానీ నలుగురు కాలేజీ చదువుల కొచ్చాక చాలా తక్కువ వికల్పాలు అందుబాటులో ఉన్నాయి. ఊళ్ళో పెద్ద రైతులు కొంతమంది వెళ్ళొద్దు అని సలహా చెప్పారు. అక్కడే వైద్య వృత్తి చేస్తే అండగా నిలబడతామని హమీ  ఇచ్చారు. శంకరాభరణం  సినిమాలోలా అప్పటికే ఆయుర్వేదం పోయి ఎం బీ బీ ఎస్ ల రాజ్యం వచ్చింది. మా నాన్నగారి  తరువాత వచ్చే ఆయన అదే కోవకు చెందిన వాడు. మా నాన్న గారికి కొత్త పుంతలు తొక్కడం ఇష్టం ఉండేది కాదు. సూది మందు చాలా తక్కువ సార్లు వాడే వారు. పల్లెటూర్లలో సూది మందిచ్చిన వాడే డాక్టరు. దాంట్లో నీళ్ళున్నా సరే. మా అమ్మా, అన్నయ్యలు  ఒప్పుకో లేదు. ఇంకా మేము సైకిళ్ళు తొక్క లేమన్నారు అన్నయ్యలు. వాళ్ళ తప్పేముంది. చదువుకొవాలిగా. నేనూ, తమ్ముడూ పొట్టిగా బలహీనంగా ఉండేవాళ్ళం. పెడలుకు కాళ్ళు కూడా అందేవి కాదు.

చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఆదాయం వచ్చే మార్గం  తెలియకుండా, పట్నంలో ఎలా బ్రతకాలో తెలియకుండా మా నాన్న గారు సరే నన్నారు. దీనికి కారణం కనీసం అందర్నీ డిగ్రీ వరకూ చదివించాలని.

మా అన్నయ్య లిద్దరూ పట్నం అంతా గాలించి మా కుటుంబానికి సరిపడా ఉన్న ఒక సాధారణ మైన పెంకుటింటిని ఎంపిక చేశారు. అద్దె రూ! 45, విద్యుత్తు సుంకం  అదనం. నీళ్ళు చేతి పంపు కాబట్టి అదనపు సుంకం లేదు. ఈ ఇంట్లో మాతో పాటుగా ఎలుకలు, బొద్దింకలూ, చెదలూ, చీమలూ, నల్ల చీమలూ, గండు చీమలూ, సాలీడ్లూ వగైరా అద్దె కట్టకుండా కాపుర ముండేవి. ఇవి కాక నల్లులు మా రక్తాన్నే అద్దెగా వసూలు చేస్తూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవి. వాన ప్రారంభం కాగానే పై కప్పు నుంచి ఒక చోట నీళ్ళు కారుతూ ఉండేవి. అక్కడ ఒక బక్కెటు పెట్టి ఇటు తిరిగే లోపు ఇంకో చోట, ఇంకో చోట, ఇంకో చోట చివరికి ఇంట్లో గిన్నెలన్నీ ఖాళీ అయ్యేదాక కారుతూ ఉండేవి. నీళ్ళ చుక్కలు మీద పడకుండా మా మంచాలు ఎంత పక్కకి జరిపినా చివరకు ప్రొద్దున్న నిద్ర లేచే వరకు సగం తడిసే వాళ్ళం.  ఎండా కాలం వస్తే పై కప్పు నుంచి దుమ్ము రాలుతూ ఉండేది. చాలా వింతైన విషయం ఏమిటంటే మా ఇంటి యజమాని, వారి వైపు కప్పు పరిపించుకొని మా వైపు వదిలెసాడు. అడిగితే "మీ బతుకులకి అది చాలు అన్నట్లు" మాట్లాడాడు. ఎన్న్ని కోట్ల మంది ఇప్పటికీ ఇదే రకమైన సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారో కదా. ఎంతమంది ఉండడానికి ఒక ఇల్లు కాక, అక్రమంగా సంపాదించిన దానితో ఇంకా ఇళ్ళు కట్టాలనీ, పది మందికీ చెప్పుకోవాలని ముఖ పుస్తకంలో ఇళ్ళ బొమ్మలు, కార్ల రిజిస్ట్రషన్ కార్డులు గర్వంగా పెట్టుకుంటుంటారో కదా! వ్యవస్థలోఎన్ని లోపాలో. ఈ లోపాలతో ఎన్నెన్ని అవస్థలో. చిల్లి గవ్వ లేని నేను నేరస్తుణ్ణి. వీళ్ళు  సమాజంలో పెద్ద మనుషులు. (మీరు డికెన్స్ రాసిన పుస్తకాల్లో ఇలంటి జీవితాలని పదే, పదే చూస్తారు). కానీ మాకున్న కొద్దిపాటి ఆదాయంతో మేము ఇల్లు మారే పరిస్థితి లేదు.


ఈ ఇంట్లో ఒక బహిరంగ మరుగు దొడ్డి ఉండేది. ప్రతి రోజూ వచ్చి ఆ దొడ్డి శుభ్రం చేసి మలం సంచిలో మోసుకెళ్ళడం  ఒక స్త్రీ ఉద్యోగం. ఈ పని చెయ్యలేక ఆమె చాలా రోజులు పని మానేసేది. ముఖ్యంగా వర్షా కాలంలో. రోజులు భయంకరంగా గడిచేవి. ఎంత దౌర్భాగ్య మండీ? బీదల కొసం త్యాగం చేస్తున్నామనే రాజకీయ వ్యవస్థలో, తిన్నదాన్లో  అశుభ్రాన్ని వదిలించుకోవడానికి కొందరూ, ఆ అశుభ్రాన్ని తీసి, తరువాత తినలేక  మరి కొందరూ. వాకిట్లో కూర్చున్నప్పుడు ఆమె అందరి మలాన్నీ బుజాన్న వేసుకుని మనసు చెదిరి పెద్దగా తిట్టుకుంటూ పొతుంటే చాలా బాధ కలిగేది. "నా దురదృష్టాన్నే  నేను తిట్టుకుంటుంటే వీళ్ళకు విముక్తి ఎప్పుడు" అనిపించేది. ఈ కుళ్ళు వ్యవస్థలో నేనూ భాగస్వమినే కదా! శ్రీ, శ్రీ చ్ర్ప్పిన రధ చక్రా లెక్కడ? ఇంకా కదలవేమిటి? మనం మార మేమిటి? మనసున మనసై ఒకరి కొకరం తోడుగా ఉండమేమిటి? కొడుకులతో పాటు ఇంకా రాజులు కుక్కల్ని పెంచుకుంటూనే వున్నారే? నాది అనుకున్నది నీది కాకుండా పోతుందని  పక్క వాడి పీక నొక్కే రోజుల నుంచి విముక్తి ఎప్పుడు?


మీదు  మిక్కిలి మా యజమానులు తెచ్చి పెట్టుకున్న ఆచారాలలో అందె వేసిన చెయ్యి. మలిన మైన  మనసులూ. చేసేవి శివ పూజలూనూ. ఈ వంకన మా అమ్మ మీద ఎన్నో రకాలుగా ఆంక్షలు పెట్టే వాళ్ళు. మా పేదరికాన్ని పదే , పదే ఎగతాళి చేసే వాళ్ళు. తిండికి లేదా, పాపం లాంటి మాట లెన్నెన్నో. డబ్బు లేని వాడు ఎందుకూ కొరగాడు. అదేమిటో, చాలా మందికి ఇలాంటి సందర్భాల్లో వీళ్ళందరి కంటే ఎక్కువ సంపదించాలని ఉంటుంది. నా మనస్తత్వ మేమిటో నాకు డబ్బు మీద విరక్తి వచ్చింది. సంపాదించిన దాంట్లో  ఎక్కువ దానాలకే వాడాలనే ఒక పాడు ఆలోచన మనసులో నాటుకు పోయింది. ఇది నాకు ఉపయోగ పడింది కానీ భార్యా,బిడ్డల్ని సుఖ పెట్టలేక పోయాను. ఈ గుణం ఇంకా అలానే ఉండడం, డబ్బు లేక పోవడం రెండూ శాపాలే!

కాలెజీలో చేరే రోజు వచ్చింది. మా కాలేజీకి ఏ విషయంలోనూ మంచి పేరు లేదు. కానీ కుల పోరాటాలూ, యూనియన్ల గొడవలూ, ముష్టి యుద్దాలకు ప్రతీతి. ఎన్ సీ సీ లో మాత్రం చాలా మంచి పేరుండేది. ప్రతి విద్యార్ధీ తన తల్లిని కానీ, తండ్రిని కానీ, పోషకుడిని కానీ వెంట పెట్టుకుని రావాలి. తల్లిదండ్రుల స్థితిని బట్టి పిల్లవాడి మార్కులని బట్టీ బేరముండేది, "ఎంత కడతావు?" అని. నా వంతు వచ్చేటప్పటికి,  ఆ కాలేజీ వ్యవస్థాపకుల్లో ప్రధానమైన  కాంగ్రెస్ నాయకులు, శ్రీ నన్నపనేని వెంకట రావు గారు నా మార్కులు చూసి, "మీ అబ్బాయికి  మా కాలేజీలో సీటు  లేదు" అన్నారు. ఆయనకి మా నాన్నగారు బాగా తెలుసు. మా నాన్నగారు ఒక్క సారి కంగు తిన్నారు. "ఏమిటి  డాక్టరు గారు, ఈ పిల్ల వాడిని మా కాలేజీలో ఎందుకు చేరుస్తారు. విజయవాడ  లయోలా లో చేర్చి ఇంజనీరుని చెయ్యండి" అని సలహ చెప్పారు. "నాకంత స్తోమత లేదు" అని మా నాన్న గారు తేల్చి చెప్పారు. "జీతం నేను కడతాను" అన్నారాయన. (నిజంగా కట్టే వారేమో తెలియదు). హాస్టలు ఖర్చులూ వగైరా చాలా అవుతాయి, వద్దులెణ్ది అన్నారు మా నానాగారు.  సరే, మీ దగ్గర నుంచి నేనేమీ తీసుకోను. నేనే పది రూపాయలు కట్టి భాగ్య లక్ష్మి లాటరీ టిక్కెట్లిస్తాను, అని పది టికట్లిచ్చారు. (ఆ సంవత్సరం ఈ టికెట్లు అమ్మే బాధ్యత కాలేజీల మీద పడింది) "లాటరీ  తగిలితే లయోలో చేర్పించండి అని చాలా మనస్ఫూర్తిగా అశీర్వదించారు  ఆయన. లాటరీ రాలేదూ, లయోలాకి వెళ్ళలేదు. కాలేజీ జీవితం పెద్ద సంఘటనలు లేకుండానే గడిచి పోయింది. స్కూల్లో వచ్చినన్ని మార్కులు రాకపోయినా, తెలివి కల పిల్ల వాడు అని ఒక్క సంవత్సరంలో కాలేజీలో నా పేరు అందరికీ తెలిసి పోయింది.

                                          ##################################


పీ యూ సీ చదువుతుండగానే నన్ను ముందు చాలా బాధ పెట్టినా, తరువాత నాలో ఆత్మ విశ్వాసాన్ని  పెంచి, ఆంగ్ల  భాషలో అసాధారణంగా మాట్లాడ గలిగే శక్తి నిచ్చి, నా భవిష్యత్తుకి పునాది వేసిన సంఘటన జరిగింది.  ఆ సంవత్సరం ఆ వూరు రోటరీ క్లబ్ వారు పట్నంలో ఉన్న మూడు కాలేజీల్లోను చేరిన విద్యార్ధుల్లో అంతకు ముందు సంవత్సరం ఎక్కువ మార్కులొచ్చిన విద్యార్ధులకి తలకు 100 రూపాయలు ఇవ్వాలని  సంకల్పించారు. వాళ్ళు ఈ విషయం పోస్టు  కార్డు ద్వారా నాకు తెలియ పరిచారుట. అది నాకు చేర లేదు. కొన్నాళ్ళకి  హైదరాబాదులో ఉండే మా పెద్ద మామయ్య, శ్రీ పెనుమాక రామచంద్ర రావు గారు, ఒక ఉత్తరం ద్వారా ఇలా తెలియ పరిచారు. "చంద్రుడుకి  100 రూపాయలు రోటరీ వాళ్ళిచ్చిన విషయం ఆంధ్ర జ్యోతిలో చదివి చాలా సంతోషించాను. వాడికి ఆశీస్సులు"  అని.  (అప్పట్లో జిల్లాకి ఒక ఎడిషన్ లేదు). ఆ ఉత్తరం చదివాక మా నాన్న గారి ఆవేదన అంతు తెలియనిది. 100 రూపాయలా? అంటే 50 కిలోల బియ్యం? చాల ఆందోలణ పడ్డారు అవి పొయ్యాయేమోనని.  "వెళ్ళి క్లబ్బులో అడుగు" అని నాకు చెప్పారు. నేను కష్ట పడి ఆ క్లబ్ సెక్రెటరీ గారైన శ్రీ టీ వీ ఎస్ శాస్త్రి  గారి ఇల్లు తెలుసుకొని వెళ్ళాను. ఆయన పట్నంలో పేరు మోసిన లాయరు. ఆయన నన్ను ఒక అరగంట ప్రశ్నలు వేసి, నేను నేనే అని సాక్ష్యాధారాలతో రుజువయ్యాక, మళ్ళీ నీకు కార్డు  పంపిస్తాను, వచ్చి తీసుకో ఈ సారి మీటింగులో అన్నారు. ఈ సారి కార్డు నీ చేతికే అందేట్టు పపంపుతాను అని కూడా చెప్పారు. వీళ్ళకి ప్రచార మోజు ఎక్కువ. అప్పుడే ఒక చెక్కు రాసి ఇవ్వవచ్చు, నేనెవరో కాలేజీలో కనుక్కొని.

కానీ, చెప్పినట్లుగానే  వారి మనిషి ద్వారా కార్డు పంపారు, పలనా రోజు వచ్చి చెక్కు తీసుకొమ్మని. మీటింగు రోజున వెళ్ళాను. అందరితో పాటే నాకు టీ, బిస్కట్లు ఇచ్చారు. సగం చిరిగిన ప్యాంటు, పాత నల్ల చొక్కా వేసుకున్న నేను మొదటి సారి డబ్బున్న వాళ్ళ వైభవాన్ని  చూసి అందులో పూర్తిగా  నన్ను నేను మర్చి పోయాను. చెక్కు ఇచ్చారు. ఆ మర్నాడు మళ్ళీ ఆంధ్ర జ్యోతిలో వచ్చింది. "డబ్బు లేని అతి పేద విద్యార్ధికి, డబ్బున్న రోటరీ క్లబ్ వాళ్ళు దయతో వంద రూపాయలు దానం చేశారు అని. నాకు కోపం వచ్చింది. కోపం వస్తే నా కలం వేగంగా పరుగెత్తుతుంది. ఇప్పటికీ మీరు చూస్తూనె ఉంటారు. మా నాన్న గారికి తెలియకుండా, అదే రోజు వాళ్ళకి ఉత్తరం రాశాను తెలుగులో. చాలా ఘాటుగా రాశాను, మీరు పేదరికాన్నే చూస్తారా తెలివిని చూడరా వగైరా. రోటరీ వాళ్ళనీ వదల లేదు. మొత్తం సంఘటన రాశాను. అది ఒక వారం తరువాత, నేను రాసింది రాసినట్లు ప్రచురించారు. (అది జర్నలిజంలో నా మొదటి అడుగు). ఈ లోగా నేనూ, మా నాన్నగారూ   చెక్కు తీసుకొని ఆంధ్రా బ్యాంకుకి వెళ్ళాము. ఆ చెక్కు రాసి దాదాపు ఆరు నెలలు దగ్గర పడుతున్నాయి.  నేనేమో స్కూలు పిల్లాడిలా  ఉన్నాను. క్లర్కుకి సందేహమొచ్చి, మేనేజరు దగ్గరకి  పంపాడు. ఆయనా నమ్మ లేదు. వెనకాల శాస్త్రి గారి సంతకం తీసుకు రమ్మన్నారు.  పరుగెత్తుకుంటూ వెళ్ళి సంతకం తీసుకొచ్చాను. డబ్బులిచ్చారు. అది account payee కాదు. మేనేజరు  గారు మా నాన్న గారికి క్షమాపణలు చెప్పారు. ఆయన మీద అప్పటికీ, ఇప్పటికీ మాకు కోపం లేదు. ఇది నా జీవితంలో రెండో ఆదాయం. ఏడో తరగతిలో 30 రూపాయలు వచ్చింది, ఎంతో పోరాటం చేశాక, మా నాన్నగారు, ప్రధానోపాద్యాయులు.

నేను ఆంధ్ర జ్యోతికి రాసిన ఉత్తరం వారం తరువాత ప్రచురించ బడింది. అది చూసి, సదరు శాస్త్రి  గారికి కోపం వచ్చింది. పిలిపించి ముక్క చీవాట్లు పెట్టారు. "నీకెంత ధైర్యం? సిమ్హాల్లాంటి రోటరీ మెంబర్లనే ఢీకొంటావా  అని." నేను తొణక లేదు, బెణక లేదు. మీరు మూడు తప్పులు చేశారు సార్, ఇది తప్పైతే నేను ఒక్కటే చేసినట్టు అని కుండ బద్దలు కొట్టాను. ఏమనుకున్నాడో వెళ్ళి పొమ్మన్నాడు. బయటి వ్యవస్థతో  మొదటి పోరాటానికి నాంది పడింది. ఈ విధంగా పోట్లాడి  చాలా  పనులు సాధించాను, జీవితంలో.

నేను బీ ఎస్ సీ మొదటి సంవత్సరం లోకి వచ్చాక నా మొదటి స్కాలర్షిప్ చెక్కు వచ్చింది. నెలకు 75 రూపాయల చొప్పున తొమ్మిది నెలలకు 675 రూపాయలు. కాలేజీ క్లర్కు వచ్చి చెక్కు తీసుకోమని కబురు పెట్టాడు. ఆయన ఒక తెల్లటి చొక్కా, ధోవతి కట్టుకున్న, ప్రసన్న వదనంతో ఉండే ఒక తెల్లటి బ్రాహ్మణుడు. ఆయనంటే పిల్లలకి చాలా గౌరవం ఉండేది. ఆయన ఒక పెద్ద పుస్తకం నా ముందుంచి,  ఒక రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టమన్నాడు. నేను చదివాను. 675 రూపాయలు. సరిగానే ఉంది. పైన "సొమ్ము ముట్టినది" (received payment) అని రాసుంది. నాకు చెక్కు ఇస్తేనే గానీ సంతకం పెట్టనన్నాను. పైన రాసున్నది చూపించాను. ఆయనకి మహదానందమేసింది, ఇలాంటి పిల్లలు కుడా ఉంటారా అని. నవ్వి, అదే పద్ధతి అని చెప్పాడు. రాసిన చెక్కు కూడా చూపించాడు. దాని డబ్బులు మీరు తరువాత తెస్సుకోరని నమ్మకమేమంటి అని అడిగాను. ఆయన శర్మ అని, ఎప్పుడూ నోట్లో పాను పెట్టుకొని, ఉతకని, నల్లటి బట్టలు వేసుకునే ఇంకో బ్రాహ్మణ క్లర్కుని పిలిచాడు. ఈన నోరు తెరిస్తే తిట్లే. "నోరు మూసుకుని సంతకం పెట్టు. పెద్ద వాళ్ళంటే గౌరవం లేదా?" అని అరిచాడు. నేను పెట్టను అన్నాను. ఆయన్ని పంపించేశారు, బాలక్రిష్ణ మాస్టారు. "ఇలా ఐతే ఇది ప్రిన్సిపాలు దగ్గర కెళ్ళాల్సిందే"  అని చిన్న బెదిరింపు ప్రయోగం చేశారు.

మా ప్రిన్సిపాలు  ఒక నల్లటి, లావుపాటి మేడం. చాలా క్రమశిక్షణ కల మనిషి. ఎవరినీ లెకా చెసేది కాదు. క్రమశిక్షణ అమలులో చాలా పకడ్బందీగా వ్యవహరించేది. అత్యంత చెడు విద్యార్ధి కూడా ఆమె దగ్గర మాట్లాడాలంటే భయ పడే వాడు. ఆమె పేరు శ్రీమతి సాల్మన్ రాజు.  నేను బెదురుతానని  ఆయన ఈ ప్రయోగం చేసాడు. ఆమె  గనక నాకు అర్ధమయేటట్లు  చెబితే నేను సంతకం పెడ్తాను అని చెప్పాను. ఇద్దరం వెళ్ళాం. ఆయన నవ్వుతూనే విషయం చెప్పాడు. ఆ రోజు నిక్కరు వేసుకుని ఉన్నాను. స్కూలు పిల్లవాడి ముఖం. పొట్టిగా, సన్నగా, పోషణ  తక్కువగా ఉన్న నన్ను చూసి ఆమెకి ముచ్చటేసినట్లుంది. దగ్గరకు పిలిచి బుజం తట్టి చెక్కు ఇచ్చేసింది. ఇప్పుడు సంతకం పెడతావా అని అడిగింది. పెట్టాను. అప్పుడు మొత్తం చెప్పింది. ఇది పద్ధతి. ఈ చెక్కు నువ్వు తప్పితే ఇంకెవరూ తీసుకోడానికి లేదు. చెక్కు వెనుక నీ సంతకం పెట్టి నా దగ్గర సంతకం తీసుకుంటేనే బ్యాంకు వారు డబ్బులిస్తారూ, అని. ఈ సంఘటనలో రెండు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. పూర్తిగా ఆలోచించకుండా, విషయం అంతా తెలుసుకోకుండా నేను ఏ పనీ చేసే వాణ్ణి కాదు. తెలుసుకున్న దాకా గుంజే వాణ్ణి. ఇంత analytical ability ఉన్న నేను పప్పులో కాలేశాను. ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా కొన్ని పనులు చేశాను. ఇది అప్పట్లో నాలో ఉన్న "విభిన్న వ్యకిత్వం" ఇదే, దెబ్బ తిన్న తరువాత bipolar probleam గా మారి మరింత ఇబ్బంది పెట్టింది. మందుల కంటే పట్టుదలతో, నా భార్య, పిల్లల సహకారంతో బయట పడ్డాను. మందు మానేశాను. పెద్ద సమస్యతో డాక్టరు దగ్గరి కెళ్ళి దాదాపు 5 సంవత్సరాలౌతుంది. జ్వరం కూడా రాదు.


                                                            #########################


అదే సంవత్సరం కొన్ని రోజులు  పొయ్యాక ఆంగ్లంలో ధారళంగా మాట్లాడే (మొదటి నుంచి ఆంగ్ల బోధన  తీసుకున్న వారు) కొందరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. శాస్త్రి గారు నన్ను రోటరాక్ట్ క్లబ్బులో  చేరమని ప్రత్యేకంగా ఆహ్వానించారని. ఇది రొటరీ క్లబ్బుకు  అనుబంధ యువ సంస్థ. నేను డబ్బు ఏమాత్రం కట్టలేనని వినయంగా చెప్పాను. కానీ , శాస్త్రి గారు తానే డబ్బు కట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తరువాత తెలిసింది.గొప్ప, గొప్ప వాళ్ళు మాత్రమే ఉండే  ఒక గొప్ప సంస్థకు సెక్రటరీ  అయిన ఒక గొప్ప లాయరు ఎదురుగా నిలబడి మీరు తప్పు చేశారు అని చెప్పగలిగే ఒక చిన్న, పేద పిల్లవాడిలో ఏదో తెలియని గొప్పతనం ఆయనకి కనిపించి ఉండవచ్చు. కొన్ని రోజుల్లో ఈ రోటరాక్ట్ మెంబర్లు (అంతా ధనవంతుల బిడ్డలే, బహిశా నేనొక్కడినే బీద వాణ్ణి) .నన్ను చాలా అభిమానంగా చూసి, వారిలో ఒకడిగా చేసుకుని నాకు ఆంగ్లంలో ధారాళంగా  మాట్లాడే అవకాశం కల్పించారు. శాస్త్రి  గారికి సదా కృతఙ్నుణ్ణి. చిన్న సైజులో, ఎప్పుడూ నవ్వితూ, నవ్విస్తూ, ధారళమైన నా వాక్ప్రవాహానికి వాళ్ళు సంతోషంగా నన్ను ఒకా తమ్ముడిలాగా చూసుకున్నారు! ధన్యవాదాలు మిత్రులారా! మీతో ఉన్న కొద్ది నెలలూ, నా జీవన గమనాన్నే మార్చాయి. నాలో కొండంత ఆత్మ విశ్వాసాన్ని నింపి, నన్ను మీలో ఒకడిగా చేసి నాకు జీవితాన్నిచ్చిన మిమ్మల్నెప్పుడూ మరచి పోను!  మీకు భగవంతుడు పూర్ణాయుస్షు  ఇచ్చి, మీ తరువాతి తరాలను చల్లగా చూడాలని మనసారా భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

ఇలాంటి కాలేజిల్లో చదువుకునే వారికి పెద్ద అనుభవాలు ఉండవు, పెద్ద మల్ల యుద్ధ వీరుడో, ముష్టి యుద్ధ వీరుడో అయితే తప్పించి. జీవితం అలా గడిచి పోయింది. ఆ సంవత్సరం నాకు ఆంగ్లంలో కాలేజీ స్థాపించిన దగ్గరనుంచీ అత్యదిక మార్కులు 170/300 వచ్చాయి. (పరీక్ష  రాసేప్పుడు  నేను తీసుకునే అదనపు కాగితాలు చూసి పర్యవేక్షకుడికి అనుమాన మొచ్చి లెక్క వేశాడు. మూడు గంటల్లో 38 కాగితాలు రాసేశాను). ఆంధ్రా యూనివర్సిటీలో భాషల్లో మొదటి  పది మందిలో ఉన్నాను. అది విని మా ఆంగ్ల భాష ముఖ్య అధ్యాపకులు (ఈయనని హృదయ టక్కు  అని పిలిచేవారు. నాకంటే రెండు అంగుళాలు పొట్టి. గుండె  వరకు చొక్కా tuck చేసేవారు, ఆంగ్ల భాషలో దిట్ట, షేక్స్పియర్ చెబితే చాలా బాగుండేది, చాలా మంది వెళ్ళి పోయే వారు అర్ధం కాక) నన్ను చూద్దామని  పిలిపించారు. మేము కూడా బాగానే చెబుతున్నామని  రుజువు చేశావొయ్. ఇన్నాళ్ళూ మాకెప్పుడూ మా మీద నమ్మకముండేది కాదు. ఒక్కడూ పాస్ కూడా అయ్యే వాడు కాదు అని చెప్పి అందర్నీ నవ్వించి పంపారు. ఆయనే చెప్పారు కాలేజీ పెట్టాక నాదే ఎక్కువ మార్కు అని, ఆశీర్వదించి పంపారు.

రెండో సంవత్సరం చివర్లో ఒక స్నేహితుడు "చంద్రా నీ పేరు బోర్డులో ఉంది చూసుకో" అని చెప్పాడు . నాకు ఫీజు లేకుండా చేశారు వెంకటరావు గారు. పేరెందుకు పెట్టారో అర్ధం కాలేదు. వెళ్ళి చూసుకుంటే ఆంగ్ల భాషలో ఆ సంవత్సరం మొదటి మార్కు వచ్చినందుకు కళాశాల వార్షికొత్సవంలో బహుమతి అందుకోమని ఉంది. చాలా ఉన్నాయి  కాని, నా పేరు కనబడగానే ఆనందంగా  వెళ్ళి పోయాను. వార్షికొత్సవం రోజు ఉన్న చిరిగిన బట్టల్లో మంచివి వేసుకుని వెళ్ళాను. ( ఆ నాలుగేళ్ళు కొత్త బట్టలు కొనుక్కున్న గుర్తు లేదు. పెద్ద వాళ్ళవి సైజు చేసుకుని వాడుకోవడమే గుర్తు). నా పేరు పిలవగానే ఒక పుస్తకం బహుమతి అందుకున్నాను. మళ్ళీ పిలిచారు. తెలుగులో మొదటి మార్కు. ఇంకో పుస్తకం. ఆ పేర్లు చదివే అధ్యాపకుడు పక్కన నిలబడు బాబూ, ప్రతి సారీ పిలవలేను అన్నాడు. వరసగా అన్ని పాఠ్యంశాల్లోనూ నాకే మొదటి  బహుమతి. చివర్కి రెండో సంవత్సరం అన్ని డిగ్రీ  తరగతుల్లోనూ (బీ ఏ, బీ కాం , బీ ఎస్ సీ) ఉత్తమ విద్యార్దిగా నాకే బహుమతి, చాంబర్ డిక్షనరీ. ఇన్ని పుస్తకాల బరువు మొయ్య లేక పోయాను. అందరూ నవ్వారు. మా స్నేహితుడొకడొచ్చి సగం పుస్తకాలు పట్టుకున్నాడు. ఆ రోజు రిక్షా లో ఇంటి కెళ్ళాను. మా స్నేహితుడు డబ్బులిస్తానని చెప్పాక. (నాన్న గారి దగ్గర డబ్బులున్నాయో  లేదోనని నాకనుమానం). మా నాన్న గారే డబ్బులిచ్చారు.  మరునాడు మా నాన్నగారు ఆ పుస్తకాలు పేజీలు తిప్పుతూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. మా నాన్నగారు మోడీ లాంటి వారు. స్థితప్రఙులు. కానీ కష్టాలు మరీ ఎక్కువై తట్టుకోలేక పోయారు. నను ఎదురుగా పొగడక పోయినా, నేను ఆయన కొడుకునని గర్వ పడే వారు. అందరికీ చెప్పుకునే వారు.

అదే సంవత్సరం  నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వ్రాత పరీక్షకు పిలుపు వచ్చింది. (ఆ రోజుల్లో క్లర్కు ఉద్యోగానికి 18 ఏళ్ళు నిండి 10/11 తరగతుల్లు చదివి వుంటే చాలు). మా నాన్న గారికి కనీసం అందరూ డిగ్రీ చదవకుండా ఉద్యోగాలకి పంపడం ఇష్టముండేది కాదు. నన్ను పంపేటప్పుడు ఏడ్చారు. తన స్వార్ధం కోసం నన్ను బలి పశువును చేస్తున్నాన్నని . నాకు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని ఆయన నమ్మకం, ఎవరి సహాయం లేకుండా.      

మా అమ్మగారు బలవంత పెట్టారు. కనీసం ఒకడు సంపాదించడం మొదలు పెడితే కుటుంబ పరిస్థితులు బాగు పడతాయని. నా జీవితంలో మొదటి సారి 30 కిలో మీటర్లు మించి ప్రయాణం చేసి విశాఖ పట్నం వెళ్ళాను. మా పెద్దన్నయ్య గారి కొత్త చుట్టాలింట్లో  దిగాను. ఆ ఇల్లు సరస్వతీ నిలయం. వాళ్ళ నాన్న గారు చని పోతే పెద్దన్నయ్య మిగతా పిల్లలందరికి చదువులు చెప్పిస్తున్నారు. ధన్య జీవి. తన తల్లిని తూలనాడి తమ్ముళ్ళని బయటికి పొమ్మన లేదు. ఆయనకి మనః పూర్వక నమస్సులు. మిత్రులారా, మీరెక్కడున్నా పెద్ద ఉద్యోగాల్లో  ఉండి, సేవ చేసి ఉంటారని ఆశిస్తాను. దీంట్లో ఒక తమ్ముడి పేరు కన్న బాబు. ఆయనే స్టేషను  కొచ్చారు. మళ్ళీ  దించారు. ఎంత మంచి, పరిపక్వమైన కుటుంబం? ఆ పరీక్ష పాస్ అయ్యాను. ఇంటర్వ్యూ మళ్ళీ అక్కడే. మకాం అక్కడే.

బ్యాంకుకు ఇంటర్వ్యూకి  వెళ్ళినప్పుడు చాలా హాస్య సన్నివేశాలు జరిగాయి. నాలా వచ్చిన వారి పక్కన కూర్చున్నాను. బ్యాంకులో  ఉద్యోగస్తులు, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు. చివరికి పేర్లు పిలిచే  అటెండరూ  నన్నొక (ఎప్పుడో కానీ కనిపించని వలస పక్షిని) చూసినట్టు చూడడం మొదలెట్టారు. చివరికి ఒక అధికారి, ఉత్సుకత ఆపుకోలేక, సీటు నుంచి వచ్చి, ఏం పని మీద వచ్చావని వాకబు చేశాడు. నా ఆహ్వాన పత్రాన్ని చూపించాను. కాసేపు నా వంకా, ఆ కాగితం వంకా అనుమానంగా చూసి వెనక్కు వెళ్ళాడు. చాలా కళ్ళు ఏంటి  విశేషం అని అడిగాయి. ఈన కళ్ళు అనుమానంగా నిజం చెప్పేశాయి. కొంతమొంది ఒక వెకిలి నవ్వు విసిరారు, కొంతమంది ఆశ్చర్య పడ్డారు, కొంతమంది కళ్ళతోనే ఆశీర్వదించారు. లోకో భిన్న రుచి. వాళ్ళు నన్నెందుకు అలా చూస్తున్నరో నాకు అర్ధమయ్యింది.

నా ప్రాముఖ్యానికి నేను పొంగి పోయాను. కొన్ని, విమర్శనాత్మక కళ్ళు,
"ఎవరయ్యా, నువ్వు? చాలా సంవత్సరాలు తిండి  తినని  బాల గణేషుడులా ఉన్నావే?" అంటున్నాయి  ఆ కళ్ళు. "లేదు నాయనా! నేను చంద్రుడిని. గణేషుడిని చూసి నవ్వితే అమ్మ పార్వతి  శాపం పెట్టింది. నా కొడుకు ఎత్తు మాత్రమే ప్రసాదిస్తున్నాను. బరువు మాత్రం నా కొడుక్కి సరిగా వ్యతిరెకంగా ఉండు" అని. అన్నాయి నా కళ్ళు. (కల్పితం)

చిరు నవ్వులు చిందిస్తూ ఆ అటెండరు నా పేరు పిలిచాడు. ఆ తిరిగే తలుపు చాలా బరువు. మొదటి సారి తెరవ లేక పోయాను. రెండో సారి ప్రయత్నిస్తే వచ్చి తలకు కొట్టుకుంది. (ఇది కల్పితం కాదు). ఆ నవ్వే అటెండరు "నువ్వేం తెరుస్తావులే ఉండు" అన్నట్లు తలుపు తెరిచి నేను లోపలి కెళ్ళే దాకా పట్టుకున్నాడు. "ఈ అబ్బాయి ఎవరు? ఇప్పుడేమీ మాట్లాడడం కుదరదు.  ఇంటర్వ్యూలు అయ్యాక రమ్మను అని భయంకరాకారుడయిన ఒక భారీ కాయం ఆయన వేసుకున్న తళతళ మెరిసే కోటు తళుకు తగ్గేలా పెద్దగా అరిచాడు. పక్కనే ఒక మామూలు సైజులో, మామూలు చొక్కా  వేసుకున్న ఇంకొక పెద్ద మనిషి " చదువుల అప్పు కోసం వచ్చాడేమో" అన్నడు జాలిగా. "లేదు సార్. ఇంటర్వ్యూకే" నవ్వాడు  మా తలుపులు. "ఏమిటీఈఈఈఈఈఈ?" దీర్ఘం తీసింది భారీ కాయం. మిగతా వాళ్ళు నవ్వి, తలొక గ్లాసూ మంచి నీళ్ళు తాగారు. "పిలిచాం కదా! వచ్చి కూర్చో!" అన్నట్లు  కళ్ళు లోపలికి పిలిచాయి.

అందరికీ నమస్కారం చెప్పి వెళ్ళి కూర్చున్నాను. "చూస్తే స్కూలు బాలుడి లాగా ఉన్నావు. (ఇది నాకు 35 ఏళ్ళ వయసు వచ్చేదాకా వింటూనే ఉన్నాను, అప్పటికి మేనేజరు అయ్యి మూడేళ్ళు). ఉద్యోగంలో చేరడానికి తొందరేమిటి" అదిగింది భారీ ఖాయం. "ఎందుకంటే మా ఇంట్లో అందరం కడుపు నిండుగా భోజనం చెయ్యడానికి" చాలా ధైర్యంగా చెప్పాను. (మా నాన్న గారు ఒక విషయం చెప్పారు. భయపడకు. ఈ ఉద్యోగం రాకపోతెనే మంచిది. డిగ్రీ  పూర్తి అవుతుంది అన్నట్లు సమాధానాలు చెప్పు అని).

ఆ భారీ కాయాన్ని మంచి నీళ్ళిప్పిస్తారా అని అడిగాను . ఇప్పించాడు. "నీకు భయంగా లేదా?" అని అడిగింది భారీ కాయం. "లేదు" అని చెప్పాను. "మేమంతా నవ్వాక  కూడా?" అడిగింది మళ్ళీ, భారీ కాయం. "నాకు అలవాతై పోయింది" చెప్పాను. మిగతా వాళ్ళందరూ కొంచం కుర్చీల్లో కదలడం మొదలు పెట్టారు. ఈన మాత్రం మహదానంద  పడుతున్నాడు. తరువాత చెప్పాడు, నేను మరీ చిన్న పిల్ల వాడిని కాబట్టి, ఈ ఉద్యోగానికి పనికి వస్తానా లేదా పరీక్ష పెట్టాడుట. మంచిదేగా. ప్రశ్నల వర్షం కురిపించారు. అరగంట. నేనొక్క తప్పైనా చెబుతానేమోనని. వాళ్ళ వల్ల కాలేదు. చివరికి ఒకాయనకి ఒక ఆలోచన వచ్చింది. " మన కార్మిక శాఖా మంత్రి ఎవరు?" అని. ఆయన అంతకు ముందు రోజే మారినట్లు గుర్తు. సరిగా చెప్పాను. పూర్తయ్యింది అన్నట్లు చూశాయి ఎనిమిది కళ్ళు. భారీ కాయం చెప్పింది. నీకు ఉద్యోగం వచ్చినట్లే. అయితే నీ డిగ్రీ పూర్తయ్యాక మాకు రాస్తే అప్పుడు చేర్చుకుంటాము  అని. నా పేరు చివర్లో పెడుతున్నట్లు కూడా చెప్పాడు.

ఈ లోగా, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడం, పరీక్షలు నాలుగు నెలలు వాయిదా పడడం, ఆ లిస్ట్ కాలాతీత మవ్వడం నాకు వచ్చే ఉద్యోగం చేజారి పోవడం అన్నీ  జరిగాయి. నా ఉద్యోగ జీవితంలో మొదటి పెద్ద పాము. అయితే అంతకంటే పెద్ద నిచ్చెన త్వరలోనే ఎక్కేశాను.

అయిదో భాగంలో.  గతుకుల రోడ్డుపై వేగంగా ప్రయాణం. దెబ్బలు. దెబ్బల మీద దెబ్బలు.

అయితే ఇక్కడ రెండు పేర్లు చెప్పక పోతే నేను నమ్మక ద్రోహం చేసిన వాడిని అవుతాను. వీళ్ళిద్దరూ రాముడూ,  వెంకటేశ్వరుడూ   మళ్ళీ పుట్టారు నా కొసం. విష్ణు మూర్తి 11, 12 వ అవతారాలు.

మొదట  మా మేనమామ శ్రీ పెనుమాక రామచంద్ర రావు గారు, మా అత్తయ్య శ్రీమతి విశ్వేశ్వరి. మా కుటుంబాల్లో అందరూ వారి ఇంట్లోనే మొదటి మకాం. వారి ఇంట్లో తిన్న ముద్దలతో, పెద్ద వాళ్ళమయ్యాము. అందుకే మొన్న  వెళ్ళినప్పుడు చెప్పాను.  "మీ ఇల్లు మాకు Gateway of Hyderabad" అని. భగవంతుడు వారిరువురికీ  అయురారోగ్యాలివ్వాలని ప్రార్ధిస్తూనే ఉంటాను. నా కొడుక్కి నా మీద కంటే ఆయన మీద ప్రేమ ఎక్కువంటే, మీరు ఆలోంచించ వచ్చు ఆయన మమ్మల్నెలా ఆదుకున్నాడో.

రెండో వాడు నా ప్రాణ స్నేహితుడు, ఆరమండ్ల వెంకటేశ్వర రావు. వాడి భార్య రాధా రాణి, అమ్మా , నాన్నలు, వాడి అన్నయ్య, వదినలూ, వాడి చెల్లెలు, బావ. వీళ్ళందరికీ నా మానసిక వ్యాధితో దూరమవడమనేది నాపూర్వ జన్మ పాపం. ఏమిస్తే వాళ్ళ ఋణం తీరుతుందండీ? వాణ్ణిఒక్క సారి, కుర్చీ మీద నిలబడి కావలించుకోవాలని  ఉంది. ఎందుకంటే వాడు భౌతికంగా, నైతికంగా నా కంటే చాలా ఎత్తులో ఉన్నాడు.

ముందు, ముందు వీళ్ళ పేర్లు పదే, పదే వస్తాయి మా అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళ  పేర్లతో పాటే. మీరే న్యాయ నిర్ణేతలు.  మొదటి స్థానం నా భార్య వాణికీ, ఆమె చేతుల్లో పెరిగిన నా పిల్లలకీను.

                                               
                                                 ###################################