Thursday, May 28, 2015

స్వీయ చరిత్ర మూడో భాగం. భవిష్యత్తుకి పునాది. కష్టాలకు నాంది.


స్వీయ చరిత్ర మూడో భాగం. భవిష్యత్తుకి పునాది. కష్టాలకు నాంది.ఎనిమిదో తరగతిలో పెద్ద విశేషాలేమీ లేవు. ఎప్పటిలా తరగతిలో మొదటి మార్కు రావడం, సాంఘిక శాస్త్రం పై పట్టు చిక్కక పొవడం ఆ పాఠ్యాశంపై పూర్తిగా విరక్తి పుట్టడం తప్పితే.

తొమ్మిదో తరగతిలో నాకు అత్యంత ప్రాణ స్నేహితుడు తగిలాడు. చివరి 5-6 సంవత్సరాలలో  తప్పితే మేమిద్దరము ఒకళ్ళని ఒకళ్ళం వదిలి ఉండలేదు. వీణ్ణి అందరూ ఎగతాళి చేసే వాళ్ళు. గుడ్డోడా, బండోడా,  నత్తోడా అని. నేను ఒక్కడినే అలా అనే వాణ్ణి కాదు. చాలా తెలివిగల వాడు. నాకు పాఠశాలలో పోటీ.చాలా లావుగా, పొడుగ్గా ఉండేవాడు చాలా అక్షరాలు, ఉదాహరణకి 'ర' లాంటివి పలికేవి కాదు. మొద్దు కళ్ళ జోడు ఉండేది.  ఎంత పెద్ద  సైజుగా ఉండే  వాడంటే పెద్ద వాళ్ళమయ్యాక ఒకసారి బాటా షాపుకి చెప్పులు కొందామని వెళ్ళాము.ఆ షాపు మేనేజరు మమ్మల్నిద్దర్నీ చూసి "ఇంకా బాటా వాళ్ళు బ్రహ్మ లెవెలుకు ఎదగలేదు సార్. మిమ్మల్నిద్దర్నీ స్నేహితుల్ని చేసిన సృష్టికర్తకి నా నమస్సులు" అన్నడు చతుర భాషలో. వాడు ఆ రోజుల్లోనే సిఏ  మొదటి ప్రయత్నంలో పూర్తి చేసి నాలాగే  వ్యవస్థతో తగాదా పెట్టుకుని దెబ్బ తిన్నాడు.  ఒక  సారి వాళ్ళ  అమ్మ  నన్ను పిలిపించి, "మా అబ్బాయిని వదిలి పెట్టకు. ఇద్దరూ మా ఇంట్లో చదువుకోండి. కరెంటు ఉంది కదా "అని చెప్పింది.వీళ్ళ గురించి చాలా  ఉంది నా జీవిత గమనంలో పాత్ర.


ఈ రోజుల్లో కులాల గురించి ఇంత చర్చ జరుగుతూ ఉంటుంది ఆంధ్ర ప్రదేశ్ లో. నేను చాలా సనాతన ఆచారాలు పాటించే తల్లి కడుపున పుట్టాను. వాడు చౌదరుల కుటుంబంలో పుట్టాడు. నేను సగం రొజులు వాళ్ళింట్లోనె తినే వాడిని. నా కోసం వెల్లుల్లి లేకుండా వండేది  వాళ్ళమ్మ. ఇప్పటికీ వెల్లుల్లి తినను నేను. వ్యవస్థతో పోరాటం నా తల్లి ఆచారాలు ఎదిరించడంతోనే మొదలయ్యింది నాకు చాలా చిన్న తనం లోనే.

తరువాత భాగాల్లో.

తొమ్మిదో తరగతిలో ఒక సంఘటన బాగా గుర్తు. మా తరగతి ఉపాధ్యాయులు ఒక ప్రశ్న వేశారు సాంఘిక శాస్త్రంలో. ఎవరమూ చెప్పలేదు. అందర్నీ బెంచీల మీద నిల బెట్టారు. "మళ్ళీ ఒక అవకాశం ఇస్తాను. ఐదు నిమిషాలు ఆలోచించుకొనీ మీకు గుర్తుకొస్తే మిమ్మల్ని కూర్చో బెడతాను. మిగిలిన వాళ్ళందరూ నిలబడి ఉంటారు."

నేనూ, నా ప్రాణ స్నేహితుడూ చేతులెత్తాము. ఆయన ఇంకో  తిరకాసు పెట్టారు. మీ ఇద్దర్లో ఎవరు సమాధానం చెప్పలేకపోయినా వాళ్ళని నిలబెట్టి మిగతా వాళ్ళని కూర్చో బెడతతాను అని. వాడు టక్కున చెయ్యి దించాడు. నేను మాత్రం ధైర్యంగా చెయ్యెత్తే ఉన్నాను. సమాధానం చెప్పి కూర్చున్నాను . బయటి కొచ్చాక వాడు చెప్పాడు. "నాకు కూడా అదే తెలుసు. కానీ నీలాగా ధైర్యం చెయ్యలేక పోయాను, అలా దైర్య్మంగా ఎలా ఉండాలో నేర్పు అని. నేను చెప్పాను. ఇంకా స్నేహం బలపడింది.

అలాగ వాడికి జీవితంలో అన్నీ నేనే అయ్యాను. స్నేహితుడు, వేదాంతి, గురువు, డాక్టరూ చివరికి దేవుడు కాడా. ఇద్దరికీ ఒకే రకమైన మానసిక వ్యాధి పట్టుకుంది జీవితంలో పోరాడి ఓడాక.  వాడు నిలదొక్కుకో లేక పోయాడు. నేను కోలుకున్నాను. భార్య జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో మా ఇద్దరి జీవితాలే ఉదాహరణ. వాడి భార్య చాలా మంచిది, తెలివి కలది, పెద్ద ఉద్యోగంలో ఉంది. కానీ భర్త మానసిక స్థితిని పూర్తిగా అర్ధం చేసుకో లేక పోయింది. కలిసున్నా జీవితాలు  గాడి తప్పాయి. నేను గాట్లో పడ్డాను నా భార్య ఓర్పు వల్ల. ధన్యోస్మి!


పదో తరగతిలో నా జీవన గమనాన్ని  నిర్దేశించే ఘటన జరిగింది, స్వాతంత్ర్య దినోత్సవం  నాడు స్కూలు మొత్తం మీద ఎక్కువ మార్కులు వచ్చిన నన్ను జాతీయ జెండా ఎగర వేయడానికి పిలిచారుట. ఆ రోజు కడుపు నొప్పి డ్రామా ఆడి బడి యెగ్గొట్టాను.  అవకాశం పోయింది. మరునాడు ప్రధానోపాధ్యాయులు పిలిచి ముక్క చీవాట్లు పెట్టారు. ఆ రోజుల్లో  జెండా ఎగుర వేసే అవకాశం చాలా అరుదుగా వచ్చేది. జీవితంలో వచ్చిన సదవకాశాల్ని చేతులారా పోగొట్టుకోవడం ఆ రోజే నాంది పలికింది.

పదో తరగతి లోనే మా జీవితాల్లో చాలా మార్పులు వచాయి. మా పెద్దన్నయ్య పెళ్ళయ్యింది. ఆ  పెళ్ళి అప్పట్లో అన్ని పెళ్ళిళ్ళ లాగానే రసాభాసగా ముగిసింది. మా అమ్మ గారు చెప్పుడు మాటలు విని నానా రభసా చేశారు. దీని ప్రభావం జీవితం తుది అంకం వరకూ కొన సాగుతూనే ఉండేది. ఆమె చాలా  బలమైన శక్తి. ఎదిరి నిలబడడం చాలా కష్టం. ఆ లక్షణాలు నాకు చాలా  వచ్చాయి అనిపిస్తుంది.  చిన్నప్పటి నుంచీ వంటింట్లో ఆమెతోనే ఉండే వాడే వాణ్ణి. చదువుకోడం కూడా అక్కడే. ఆమెకు మడికి అడ్డం కాని పనులన్నీ చేసే వాణ్ణి. "ఆడంగోడు" అన్నదమ్ములు ముద్దు చేస్తుండే వాళ్ళు. ఆమె రసాభాస, ఒక బంధువు రాక్షస చాణక్యం మా సంసారాన్ని చిన్నా భిన్నం చేశాయి.

ఆ సంవత్సరం మా నాన్న గారికి పెద్ద జబ్బు చేసింది. ఆయన కడుపులో అల్సర్లు తిరగ బెట్టాయి. మా నాన్న గారికి జబ్బు చేయంగానే ఆయన బతకరని మా అమ్మ ఖఛ్ఛితమైన అభిప్రాయాని కొచ్చారు. మా పెద్దన్నయని పిలిచి పంచాయతీ పెట్టింది, ఆయన పోతే నీదే బాధ్యత. ఇంకా ఆరుగున్నారు అని. ఆయన నాకేమీ సంబంధం లేదూ అని. ఈ లోగా చుట్టపు చూపుగా రాక్షస చాణక్యుల వారు దిగి ఊర్లో వాకబు మొదలెట్టారు. ఆమెకూ, మా ఈ పెద్ద పిల్ల వాడికి వయసు తేడా లేదు. ఇతను పెద్ద భార్య కొడుకై ఉండొచ్చు కదా అని.(మా నాన్న గారి మొదటి భార్య రాజ్య లక్ష్మి గారు కాల ధర్మం చేశారు. 14 సంవత్సరాల వయో విబేధం ఉన్న మా అమ్మ గారిని పెళ్ళి చేసుకున్నారు. మా నాన్నగారు నల్లగా, ముఖం పై స్ఫోటకం మచ్చలతో ఉండేవారు. మా అమ్మ గారు పచ్చగా చలిమిడి ముద్దలా ఉండే వారు)  .చాలా     మంది అవును కాబోసు నన్నారు. కొందరు కాదు మాకు తెలుసు అన్నారు. ఆయనకి కావల్సింది మొదటి సమాధానమే. నమ్మినట్లుగా మా అన్న చెవిలో వేసి ఆ వెధవల బాధ్యత నీకు లేదూ అని తేల్చి చెప్పారు. దొరికిన అవకాశం చేబుచ్చుకొని మా అన్న వల్లె అని చెప్పి వేళ్ళి పోయాడు. పోతూ, పోతూ నువ్వు నా తల్లివి కాదు అని మా అమ్మకు ఖచ్చితంగా చెప్పాడు. పెళ్ళిలో చేసిన గోలకి మా అమ్మ గారికి అనుకోని ప్రతీకారం అనుభవించాల్సొచ్చింది మా నాన్న గారు బతికారు. మేము బతికి పొయ్యాము. ఆ రోజు నుంచి వూళ్ళో అది రచ్చబండ వార్తల్లో కెక్కుతుండేది. దీని ప్రభావం చివరి వరకూ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది.

ఈ విషయం నేను ఇంత ధైర్యంగా రాయ గలిగానంటే ఈ విషయం పై ఇంత బాహాటంగా చెప్ప గలిగానంటే, ఈ విషయం మా బంధువులందర్నీ చాలా అశ్చర్య పరిచింది. ఈ విషయంపై  చర్చలు జరిగాయి. మా అమ్మ తరపు వాళ్ళు అసహ్యించుకున్నారు. ఎందుకంటే ఎవెరి పురుడు ఎవరు పొశారో అందరికీ తెలుసు. ఈ రోజు ధర్మం  మాట్లాడి, ఆయన లక్ష వత్తుల నోము చేసాడు. గుళ్ళకి దానాలు చేసాడు అంటే పాపం కరిగి పోతుందా? అమ్మ సొమ్ముతో వ్రతం చేశాడు. అది కూడా గొప్పీనా? చేసిన వాడికి లేక పోతే, చెప్పే వాడికైనా ఉండాలి కదా ఙానం. తప్పులు ఒప్పుకొని, దేవుడికి ఏమన్నా ఇస్తే ఫలితముంటుంది. తప్పుల తుప్పుతో దేవుడి కిచ్చిన దానాలు బెడిసి కొట్టే ప్రమాద ముంది. చిత్త శుద్ధి లేని శివ పూజలేలయా? అన్నాడు వేమ కవి.

ఈన  ఏ ఏ ఎం ఐ ఈ చదువుతానంటే మా నాన్న గారికున్న నాలుగెకరాల్లో అతి విలువైన పొలాన్ని 7,200 కి అమ్మి మద్రాసు పంపించారు మా నాన్నగారు. అదీ మా అమ్మ ఏడ్చి గందరగోళం చెయ్య బట్టి. అల్లాంటి తల్లిని తల్లి కాదన్న వాడిని ఏ దెవుడైనా ఏలా క్షమిస్తాడు? అదైనా పూర్తి చేశాడా? లేదు. అక్కడ జులాయి వెధవలతో చేరి, యూనియన్ పెట్టి గందరగోళం చేస్తుంటే మా నాన్నగారికి టెలిగ్రాం ఇచ్చి పిలిపించి టీ సీ ఇచ్చి పంపించాడు అక్కడి ప్రిన్సిపాలు. అప్పటికే ఉద్యోగం వేరే చోట దొరకబట్టి ఆయన బతికి పోయాడు. మేము నాశన మయ్యాము. కోట్లు సంపాదించడం గొప్ప అనుకుంటే, జూబిలీ హిల్ల్స్ లో ఒక, వ్యభిచారిణి ఒక పత్రికకు ఇంటర్వ్యూ  ఇచ్చింది. నేను వ్యభిచారం చేసి కోట్లు గడించాను. ఈ రోజు సమాజంలో నేనో చాలా గౌరవనీయ మైన వ్యక్తిని. నేను చెప్పే దాకా మీకెవరికీ నా పూర్వాశ్రమ విశేషాలు తెలియవు. అని సంచలనం సృష్టించింది. ఇంకా గొప్ప దయ్యింది. మామూలు జీత గాడి దగ్గర కోట్లు ఎలా ఉన్నాయి అని ఎవడూ అడగడు. సీ బీ ఐ వాడు పట్టుకుంటే అప్పుడడుగుతారు. ఎగతాళి చేస్తారు. ఇలాంటి వెధవ మన కుటుంబంలోనె లేడు అంటారు. కొంత మంది తండ్రి అక్రమ సంపాదన తింటూ, నాకు సూక్తి ముక్తావళి చెప్తారు. ఆ విషయం  తరువాత వస్తుంది. మీరే న్యాయ నిర్ణేతలు.


ఈ సంఘటన తరువాత మా నాన్నగారు  మా అధర్మ రాజు దగ్గర ఒక వాగ్దానం తీసుకున్నారు. నెలకు 50 రూపాయలు పంపేట్టు.  కొన్ని నెలలు పంపేవారు. కొన్ని నెలలు పంపే వారు కాదు. మా నాన్న గారు గుర్తు చేసే వారు. సమాధానం దాదాపుగా ఇదే మాటల్లో ఉండేది. " నాకూ పెళ్ళయింది. నేను పిల్లల్ని కంటున్నాను.  ఖర్చులు పెరుగుతాయి కదా.  (జీతాలు కూడా పెరుగుతాయి). అయినా అంతమంది పిల్లల్ని ఎవరు కనమన్నారు?  ఏం! ఆడపిల్లలు లేకపోతే చచ్చి పోయే వారా ? అయినా ఒక తల్లికి పుట్టని పిల్లలకి ఒకరి విషయంలో ఇంకొకరికి  బాధ్యత ఎలా  ఉంటుంది?" ఈ ఉత్తరాలు చూపించి ఏడ్చే వారు మా నాన్న. సాయంకాలం  బాధ భరించ లేక "మార్ఫియ" ఇంజక్షన్  చేసుకుండే వాళ్ళు. కొన్నాళ్ళ తరువాత నాకూ నేర్పారు ఇంజక్షన్ చెయ్యడం  ఎలాగో. అప్పటినుంచే ఆయన నిరాశ లోకి జారి పోయారు. డిఫ్ర్రెషన్  వచ్చింది. ఎప్పటికీ  కోలుకోలేక పోయారు. పట్నం వెళ్ళాక  పూర్తిగా డిప్ప్రెస్ అయ్యారు.

సవ్య సాచికి డిగ్రీ  తరువాత ఉద్యోగం రాక పొవడమూ, బలవంతాన ఎం కాం చదివించాల్సి రావడమూ, భీమసేనుడు డిగ్రీ అయ్యాక రెండేళ్ళు  ఖాళీగా   ఉండటమూ ఆయన బాధల్ని పెంచింది.  ఈ సమయంలో ఆదుకున్నది నాకు సంవత్సరానికి  వచ్చే 1200 రూపాయలు స్కాలర్షిప్పూ, మూడు ఎకరాల పొలం మీద వచ్చే సుమారు 500 రూపాయలు, మా నాన్న గారికి వచ్చే నెలకు 100 రూపాయలు ప్రాక్టీసు సొమ్మూ, ఇది గాక  నా స్కాలర్షిప్పునీ , నా తెలివి  తేటల్నీ తాకట్టు పెట్టీ మా నాన్నగారు మా ప్రధానోపాధ్యాయుల దగ్గర , ఒక ఎం ఎల్ ఏ గారి కోడలు దగ్గరా, నా ప్రాణ స్నెహితుడి వాళ్ళ అమ్మ దగ్గర ఇద్దరం నోట్ల మీద సంతకం పెట్టి తెచ్చిన అప్పుల మీదా ఇల్లు గడిచింది. 

మీరే ఊహించుకోవచ్చు. నెలకు 25 రూపాయలు (ఎందుకంటే సుమారు ఆరు నెలలే వచ్చేది) మా అధర్మ రాజు పంపింది, 100 రూపాయలు మా నాన్న గారికి వచ్చేది, 100 రూపాయలు నా స్కాలర్షిప్పు, 45 రూపాయలు పొలం మీద వచ్చేదీ కలిపితే (ఈ చివరి రెండూ సంవత్సరానికి ఒక్క సారి వచ్చేవి) 270 రూపాయల ఆదాయం. మా నాన్న గారి చివరి జీతం రూ.498-20. పల్లెటూరు కావడంతో అద్దె తక్కువ, పాలు, పెరుగు, బియ్యం, పప్పులూ వగైరా ఉచితంగా వచ్చేవి. ఊళ్ళో ఏ ఫంక్షను  జరిగినా మా ఇంటికి ప్రత్యేకంగా లడ్డూలు వగైరా వచ్చేవి. ఈ 270 రూపాయల్లో 45 రూపాయలు అద్దె కట్ట వలసి వచ్చేది. అప్పు చెయ్యకుండా ఎలా రోజులు గడిచేవి? ఊహించుకుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. ఎన్నో సార్లు ఆకలయ్యి మా స్నేహితుడి వాళ్ళ అమ్మ నడిగి ఏదన్నా వండించుకు తినే వాడిని. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఆ విధంగా నాలుగేళ్ళు. ఈ కధంతా తరువాయి భాగాల్లో. ఇప్పటికీ మేము రాసిన నొట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటి కాపీలు కూడా పెడతాను. 

ఆయనకు ఒక వెయ్యి రూపాయల ఇన్స్యూరన్సు పాలిసీ ఉంది. దాని మీద వచ్చిన సొమ్ము ఆరు నెలల భత్యానికి సరి పోయింది. మా నాన్న  గారి పీ ఎఫ్, పెన్షను చాలా సంవత్సరాల తరువాత వచ్చింది. అది రావడానికి ఎంతో ప్రయత్నం చెయ్య వలసి వచ్చింది. వ్యవస్థమీద నాకున్న కోపాన్ని అది ద్విగుణీకృతం చేసింది.  అదో పెద్ద కధ. మా నలుగురు పాండవులు కించిత్తు సహాయం చెయ్యలేదు ఈ విషయంలో.(ఇదెందుకు రాయ వలసి వచ్చిందంటే ముఖ పుస్తకంలో మా భీమ సేనుడు ఏదేదొ ఫొటోలు పెట్టి ఏదేదొ పిచ్చి రాతలు రాస్తున్నాడు. అవన్నీ కాపీ చేసి నా కధను కలుషితం చెయ్య దలుచుకొలేదు. నా ధ్యేయం నా తప్పులు ఒప్పుకుంటూ, వెరే వాళ్ళ మనస్తత్వాల ప్రభావం ఎంతవరకు నా జీవితం మీద పడింది అని చెప్పడం వరకే. వేరే వాళ్ళని విమర్శించడం కాదు. చివరి దాకా ఆగితే, నేను రాసిన ప్రతి అద్యాయము చివరికి నన్ను నేనున్న చోటికి ఏలా చెర్చిందో చెప్పడమే. ఇంక నాకు వృద్ధే కాని పతనం లేదు. ఎవరూ పతనం కావాలని కోరుకోను. సర్వే జనాహ సుఖినో భవంతు)

ఇంట్లో పెద్ద కుమారుడు ధర్మరాజు లాగా ఉండవలసిన వాడు, అధర్మ రాజు అయ్యాడు.  రెండో వాడు సవ్య సాచి. (స్థానాలెందుకు మారాయో ముందే రాశాను). రెండు చేతులతో సహాయం పొంది, రెండు చెతులతో ముంచ గలిగిన శక్తి మంతుడు. నేను నాలుగు. నకులుడి లాగ నా గుర్రం అతివేగం. మంచి గానీ, చెడు గానీ. ఐదో వాడి మీద అభాండాలేస్తే నా కళ్ళు పోతాయి. మా సంసారం కోసం అందరి కంటే ఎక్కువ చేసి ఏనాడూ మంచి చేశాడు అని ఒక మంచి మాట వినని వాడు. వాడు జీవితంలో ఏదీ మనసుకు తీసుకోలేదు కాబట్టి వాడు బతికి పోయాడు. అభిమానాలు పెంచుకొని నేను చరిత్ర రాస్తున్నాను.

కానీ ఐదో వాడు సహ దేవుడే. భార్యా విధేయుడయ్యి కొన్ని సార్లు నన్ను చాలా అవమాన పరిచ్చాడు. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కానీ అది క్షమార్హమే. నేను అంతటి గొప్ప వాడిని కాదు. కానీ దేవుడి దృష్టిలో వాడు ఎప్పుడూ మంచి వాడు గానే మిగిలిపోతాడు, గుళ్ళలో దానాలు చేయక పోయినా.

మా సవ్య సాచి చిన్నపటి నుంచీ చదువులో వెనకె. 11 వ తరగతిలో అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఒక సారి మా నాన్న గారు "ఏరా! చంద్రుడికి అన్ని మార్కులొస్తున్నాయి  కదా. నీకెందుకు రావడం లేదంటే, వాడు దాక్టరు గారి అబ్బాయి, అందుకే వేస్తున్నారు  అని సమాధానం చెప్పాడు.  

"నువ్వు ఎవరి అబ్బాయివి" అని  మా నాన్న గారు, అమ్మ విరగబడి నవ్వారు. మా నాన్నగారి దగ్గరికి పాఠశాల ఉపాధ్యాయులందరూ వచ్చే వారు. ఆయన ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి నవ్వుకున్నారు. ఉపాధ్యాయులు మా సవ్యసాచి దగ్గర చెప్పి అలాంటిదేమీ ఉండదు. వాడు చదువుతాడు. నువ్వు చదవవు" అని చెప్పారు.

పీ యూ సీ చదవడానికి హైదరాబాదు మా మా మామయ్య దగ్గరికి పంపారు. తప్పాడు. మళ్ళీ వెళ్ళీ సప్ప్లిమెంటరీలో ఉత్తీర్ణుడయ్యాడు. ఒక సంవత్సరం దాటి పోయింది. ఐతే తరువాత తిప్పుకుని, మా ఇంట్లో మొదటి పోస్టు గ్రాడ్యుయేటు  అయ్యాడు. ఒక కారణం డిగ్రీ  తరువాత ఉద్యోగం సంపాదించుకో లేక పొవడమే. చివరికి ఇప్పుడు రిటైరైన  ఉద్యోగం కూడా మా అధర్మ రాజు గారు చెప్ప బట్టి వాళ్ళ ఆఫీసులో వచ్చింది. కాని నా మీద కక్షా, కార్పణ్యం ఇప్పటికీ పోలేదు. వీరిద్దరి అధర్మ ప్రవర్తన, మూడో వాడి పిరికి గాంభీర్యము  బాధ్యతలు నెత్తిన వేసుకున్న నా మీద ఇంకా ప్రభావం చూపింది.

                                    #########################################


11 వ తరగతిలో మా ప్రధానోపాధ్యాయులూ, మా లెక్కల మాస్టారు పాఠశాల సమయం తరువాత, ఆది వారాల్లో నాకు ప్రత్యేక ఉచిత శిక్షణ నిచ్చారు. ఎంతంటే కనీసం ఒక్కొక్క లెక్క, ఒక్కొక్క ఆంగ్ల ప్రశ్న, దాదాపు 100 ల్లో పుస్తకాలు రాసుంటాను .పరీక్ష లొచ్చాయి. మొదటిది ఆంగ్ల పరీక్ష. మా మాస్టారు పిలిచి అడిగారు. 80 మార్కులొస్తాయి అని చెప్పాను. "కోతలు కొయ్యకు, ఈ   పాఠశాల చరిత్రలో ఎవరికీ అన్ని మార్కులు రాలేదు " అన్నారు. అలా గనక వస్తే ఈ సంవత్సరం నుంచీ పాఠశాలలో మొదటి మార్కు వచ్చిన వారి పేర్లు బోర్డు మీద రాయిస్తాను బంగారు రంగుతో అన్నారు. నాకు 81 వచ్చాయి. ఆయన మాట నిలబెట్టుకున్నారు.

లెక్కల పరీక్ష వచ్చింది. పేపరు ఇచ్చారు. అది మొదలు మా లెక్కల మాస్టారు  గాభరాగా తిరగడమూ, ఆయన వెనకాల ప్రధానోపాధ్యాయులూను. ఆ పేపర్లో ఒక జామెట్రీ  లెక్క వచ్చింది. అది రాంబస్ గియ్యడము. 20 మార్కులు. మా మాస్టారు అది చాలా కష్టమని, చెప్పలేదు. ఆయన అనుభవంలో ఆ ప్రశ్న రాలేదు అంత వరకూ. నేను మొదట ఆ ప్రశ్ననే  తీసుకున్నాను . చాలా సేపు పట్టింది. పూర్తి చేశాను. మిగిలిన ప్రశ్నలు ఎక్కువ  సేపు పట్ట లేదు. రెండు చిన్న ప్రశ్నలు సమయాభావం వల్ల చెయ్య లేక పోయాను.

బయటికి రాగానే మా లెక్కల మాస్టారు, ప్రధానోపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు గాభరాగా పరుగెత్తుకొచ్చారు. రాంబస్ చేశావా అని మా లెక్కల మాస్టారు అడిగారు. చేశాను మాస్టారూ అన్నాను. ఎలా చేశావురా మాస్టారు చెప్పలేదని గాభరా పడుతున్నారు అని మా ప్రధానోపాధ్యాయులు ఒక కాగితం ఇచ్చారు చేసి చూపించు అని. గీశాను. మా లెక్కల మాస్టారు చిన్న పిల్లాడిలా  ఏడవదం మొదలు పెట్టారు. ఎవరెంత చెప్పినా ఆగలేదు. మూడు గంటల ఆవెదన ఒక్కసారిగా పెల్లుబికి వచ్చి వుంటుంది. నాకు ఏమీ తోచలేదు. ఏడుపు ఆపాక నన్నెత్తుకున్నారు.

నేను కూడా చెయ్యలేని పని చేశావురా అన్నారు. ఇద్దరూ అభినందించారు. 95 మార్కులే వచ్చాయి. పర్వాలేదులే అనుకున్నాము.

అప్పట్లో గురు, శిష్య  సంబంధాలు వేరుగా ఉండేవి. ఆ తరువాత చాలా సంవత్సరాలు  వాళ్ళిద్దరూ  ప్రతి క్లాసులోను, ప్రార్ధన సమయంలోనూ నన్ను ఉదహరించే వారట  విద్యార్ధి అంటే నాలా ఉండాలని. మా కాలెజీలో,ఆఫీసులో నేను చెప్పే వాడిని గురువు లంటే వారే నని. అప్పుడే నాకు ఈ కుల వ్యవస్థ మీద నమ్మకం పోయింది. మా ప్రధానోపాధ్యాయులు చౌదరి గారు, మా లెక్కల మాస్టారు వేరే కులం, నేను బ్రాహ్మణ్ణి. నమ్మ శక్యంగా లేదు కదా! మనస్సులు నిర్మలంగా ఉంచే వాళ్ళు  పాఠశాలల్లో.

ఆ ఇద్దరి చలవ. ఇప్పటికీ ఆంగ్లంలో, లెక్కల్లో తిరుగు లేదు. 100 అంకెలు  కలం లేకుండా మొత్తం చెప్పగలను ఇప్పటికి. నాలుగంకెల సంఖ్యల్ని ఎవరన్నా చదువుతుంటే మనసు లోనె కూడి మొత్తం చెప్పగలను ఇప్పటికి. నేను ఏ ఫొను నంబరూ రాసుకోను. ఆ కంప్యూటరు నడగ వయ్యా అనేది మా బ్యాంకులో ఎప్పుడూ వినవచ్చే మాటే. మాస్టారు గార్లూ! మీ కృషితో ఇంత వాణ్ణయ్యాను. బ్రతికుంటే ఇంకా ఎదుగుతాను. పైకి వచ్చినపుడు  ఆశీస్సులు తీసుకుంటాను.

11 వ తరగతిలో పాఠశాలలో మొదటి స్థానం, రాష్ట్రంలో 35 వ స్థానం సంపాయించాను.  రెండో మార్కు వచ్చినతనికి 23 మార్కులు తక్కువొచ్చాయి. రాంబస్ ప్రభావంతో. మూడో మార్కు నా ప్రాణ స్నేహితుదికే వచ్చింది నా కంటే 32 మార్కులు తక్కువగా. రాంబస్ ప్రభావమే. వాళ్ళెవరూ ఆ లెక్క ముట్టుకోలేదు. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్పు వచ్చింది. అదే మా తరువాతి నాలుగేళ్ళూ కనీసం 25 శాతం ఇంటి ఖర్చుల్ని భరించింది. నాకు ఫీజు లేదు. చినిగిన పంట్లాములు, చొక్కాలు, డొక్క నిండని పొట్ట. చదవాలని ఆశ. చదివించే శక్తి లేని తండ్రి. ఇక్కడ ప్రారంభ  మయ్యాయి పాములు.

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.

తరువాయి భాగంలో.

నేను పల్లెటూరు నుంచి పట్నం వెళ్తున్నాను  కాబట్టి పల్లెటూర్లో నా అద్భుత అనుభవాల్ని పంచుకుంటాను.

1969 సంవత్సరం వరకూ మా కుటుంబం చాలా గొప్పగా బతికింది.

మా నాన్నగారు రోడ్డు మీద నడుస్తుంటే ఊళ్ళోపె ద్ద మనుషులు కూడా వంగి దండం పెట్టి పక్కకి తప్పుకుని నడిచే వారు. పాఠశాల ఉపాధ్యాయులు వారానికొకసారైనా కలిసి మా అందరి చదువుల గురించి చర్చించే వారు, మా నాన్న గారితో. ఎస్ సీ కాలనీలో ఆయన దేవుడే. ధర్మ ప్రభువు.

మేమెప్పుడూ  నలిగిన చొక్కా, లాగూ వేసిన గుర్తు లేదు.

మా అమ్మ సాయంత్రం అందర్నీ  చుట్టూ కూర్చోబెట్టి కంది పచ్చడీ, చింతకాయ పచ్చడీ, గోంగూర, పప్పు చారూ వగైరా ఇంత నెయ్యి పోసి కలిపి ముద్దలు పెట్టేది. వాడికి పెద్ద ముద్ద వచ్చింది, నాకు చిన్నది వచ్చింది అని మా అమ్మ మీద పోట్లాడే  వాళ్ళం. చెయ్యికి అంటుకున్న గుజ్జు పళ్ళెం అంచులకి రాసి పెడుతుంటే నాకంటే నాకని కొట్టుకునే వాళ్ళం. ఎక్కువ సార్లు మా చెల్లెళ్ళకి, నాకూ పెట్టేది మా అమ్మ. బాగా చదివే వాణ్ణి కదా. 

నేను చద్దెన్నం ససేమిరా తినే వాడిని కాదు. మా అమ్మ నాకు మాత్రం వేడి అన్నమే పెట్టేది. మిగతా వాళ్ళు ఏడిచే వాళ్ళు. "వాడు అన్నం మానేసి పోతాడురా అని బుజ్జగించేది".   నాకు కోపం వస్తే కంచం బోర్లించి అలిగే వాడిని. ఇది మా అమ్మ బతికున్నన్నాళ్ళూ పాటించేది. తనైనా తినేది కానీ నాకు పెట్టేది కాదు. (ఇది తెలిసి నా కొడుకూ, కోడలూ నన్ను చద్దెన్నం తిననివ్వరు. వాళ్ళు తిన కూడదని నేను ముందే తినేస్తాను.  అయినా ఇప్పుడు మైక్రొవేవ్ వచ్చిందిగా) 

అట్ల తద్దె వస్తే పొద్దున్నే అన్నం వండి, కంది పచ్చడీ, పెరుగూ అన్నం పెట్టి పంపించేది. బయటికెళ్ళి ఎవరి స్నేహితులతో వాళ్ళం ఆడుకుంటూ వుండే వాళ్ళం. ఇక్కడ కూడా మా భీమసేనుడు ఎవరితోనో తగాదా పెట్టుకుని తన్నులు తినొచ్చే వాడు. ఇప్పటికీ  అదే చేస్తున్నాడనుకోండి.  ఫుటకలతో వచ్చిన బుద్ధి.) 

సంక్రాంతి వస్తే మా అమ్మ మా చెల్లెళ్ళ కోసం బొమ్మలు పెట్టేది. పాత బొమ్మలు అటక మీద నుంచి దించి, చెక్క ముక్కలతోనో, కుర్చీలు, బల్లలతోనో స్టేజ్ చేసి, దుప్పట్లు కప్పి బొమ్మలు పెట్టే వాళ్ళం. దీనికి నేనూ, మా తమ్ముడే  ఎక్కువ సహాయం చేసే వాళ్ళం. (ఇదేముంది లెండి ఇల్లు చిమ్మడం,  అంట్లు తోమడం, కుంపటి వెలిగించడం, కిరాణా  షాపుల కెల్డం ఇవన్నీ మేమిద్దరమే చేసే వాళ్ళం. అదేమంటే చిన్నవాళ్ళే చెయ్యాలి అనేవాడు మా దూర్వాసుడు. లేకపోతే "నీ రొమ్ము రుధిరమ్మే" .)

ప్రతి సంక్రాంతికి పేరంటం పిలవడానికి  మా చెల్లెళ్ళని చెరో చెయ్యి పట్టుకొని ఇల్లిల్లూ తిరిగే వాళ్ళం. వాళ్ళు బొట్టూ పెడితే,  మేము చెప్పేవాళ్ళం. " మా చెల్లెళ్ళు బొమ్మలు పెట్టుకున్నారు. మిమ్మల్ని రమ్మంది మా అమ్మ" అని. (ఇది తలుచుకుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి. కానీ నేను జీవితంలో పూర్తిగా దెబ్బ తిన్నప్పుడు 'దుర్మార్గుడు, అహంభావి, వ్యసనపరుడు, తగిన శాస్తే జరిగింది, వీడు మా బజార్లో ఉంటే మా ఆయన పరువు పోతోంది అని మా అమ్మ చేత నాకు చెప్పించినప్పుడు, నైరాస్యంలో నవ్వుకున్నాను. ఏడ్చేందుకు  కళ్ళల్లో నీళ్ళు కూడా ఇంకి పోయాయి. భయంకరమైన మానసిక జబ్బు పట్టుకుంది. తప్పూ, ఒప్పూ విచక్షణా  ఙానం నశించింది. నా భార్య నా చెయ్యి వదిలితే ఈ రోజు ఇది రాయ గలిగే వాడిని కాదు)  

మళ్ళీ బాధల్లోకి వెళ్ళి పోయాను. 

ఆ విధంగా ఒక సంక్రాంతికి మేము నలుగురమూ బయలు దేరాము. నత్తి కిష్టయ్య  గారింట్లో పెద్ద అవాంతరం వచ్చింది. (ఆయనకు నత్తో, ఇంటి పేరు నత్తో నాకు తెలియదు. పెద్ద గుబురు మీసాలుండేవి. ఆయన్ని రోడ్డూ మీద చూస్తేనే భయ పడే వాళ్ళం). అందుకే నెమ్మదిగా జారుకుందామంటే ఆయన చూసి పిలిచాడు. "ఏంది బాబూ, భయమేంది. ఏం పని మీదొచ్చారు" అన్నాడు. ఆయన భార్య లోపలెక్కడో ఉంది. ఏమడగాలో తెలియ లేదు. ఆమె పేరు తెలియదు. "మీ పెళ్ళాం  ఉందా" అని అడుగుదామన్నాడు మా తమ్ముడు. " ఛీ! అలా అడగ కూడదు" అన్నాను నేను పెద్దరికంగా. "పోని మీ భార్య ఉందా?" అనడుగుదామన్నాడు వాడు. అలా కూడా అడగ కూడదు అన్నాను నేను. "ఏంది బాబు రండి, ఏందో గుణుక్కుంటరేందీ. పెద్దగా చెప్పండి" అన్నాడాయన. చివరికి ధైర్యం చేసి నేనే " మీ అమ్మ ఉందా?" అని అడిగాను. ఆయన పగలబడి  నవ్వాడు. కొంచెం వెనక్కెళ్ళాం. "ఓసేవ్! అమ్మా ! రావే! డాక్టరు గారి బాబులు వచ్చారు నీ కోసం. " ఆమె బయటికొచ్చి, కధంతా విని ముసి, ముసి నవ్వులు నవ్వుకుంటూ "చిన్న పిల్లల్ని, బెదిరించమాకండి" అని నవ్వుకుంటూ వెళ్ళి పోయింది.

మర్నాడు గుడి గట్టూ మీద కూర్చున్న పెద్ద మనుషులూ, పోరంబోకులూ మేము స్కూలు కెల్తుంటే పిలిచి " ఏంది? నత్తి కిట్టయ్య పెళ్ళాన్ని  అమ్మను సేసావంట. రోగం కుదిరిందిలే. మేమెవ్వరం చెయ్యలేని పని నువ్వు సేసావులే"  అని మెచ్చుకుంటుంటే నా కర్ధం కాలే, వీళ్ళకు కూడా నత్తి కిష్టయ్య  అంటే భయమాని. 

ఎంత బాగుందండీ ఈ అనుభవం. నాకు, మా తమ్ముడికీ ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో. నా చెయ్యి పట్టుకోందే రోడ్డు మీద కొచ్చే వాడు కాదు. రామ, లక్ష్మణులని పిలిచే వాళ్ళు ఊళ్ళో. (అలాంటిది నా కష్ట కాలంలో నాకు ఉచితంగా ఇల్లు ఇచ్చి, నువ్వు మా అన్నయ్యవని  చెప్పొద్దు అని వాడన్నపుడు ఏడవాలో, నవ్వాలో తెలియని పరిష్థితి. గృహ ప్రవేశం చేస్తూ మా ఆవిడ తరపు వాళ్ళు చాలా ధనవంతులు. నువ్వు వంట వాళ్ళ దగ్గర కూర్చో . వాళ్ళలో ఒకడివనుకుంటారు అని చెప్పినపుడు గుండె దిటవు చేసుకుని బతికాను).

చెప్పుకుంటూ పోతే చాలా అనుభావాలుంటాయండీ. కానీ ఎంత రాసినా తృప్తి తీరని కాలమది. ఇంతటితో ఆపేస్తాను.
     

నాలుగో భాగంలో పట్నంలో, పాములూ, నిచ్చెనల మధ్య కలుసుకుందాం వచ్చే వారంలో.


                                              #############################

Please wait for English version till tomorrow! Thank you for your tremendous response. Be reading. More interesting will be my career life. Please bear with me to complete this, it will take a year or so.